Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం నేతలు
న్యూఢిల్లీ : రైతులు, మహిళలు, కార్యకర్తలు ఈ నెల 21న ఢిల్లీకి మార్చ్ చేపట్టనున్నట్టు రైతుసంఘం నేతలు ప్రకటించారు. మంగళవారం బతిండాలోని తల్వాండి సాబోలో భారతీయ కిసాన్ యూనియన్ ఏర్పాటు చేసిన బైసాఖి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. జలియన్‌వాలాబాగ్‌లో మరణించిన అమర వీరులకు ఈ సమావేశాన్ని అంకితం చేశారు. 'ఖల్సా సజ్నా దివస్' పేరిట జరిగిన ఈ సమావేశంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. తల్వాండి సాబోతో పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన బైసాఖి ఉత్సవాలు పంజాబ్ అంతటా 28 ప్రదేశాల్లో జరిగాయి. ఈ సందర్భంగా బీకేయూ రాష్ట్ర అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 21న జరిగే ఈ మార్చ్‌కు కేంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కోక్రికలన్, రాష్ట్ర కోశాధికారి జహండా సింగ్ జెహటుకే నాయకత్వం వహిస్తారని అన్నారు. నల్ల చట్టాలు రద్దయ్యేంతవరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని ఉగ్రహాన్ అన్నారు. జలియన్‌వాలాబాగ్ ఉదంతం అనంతరం ప్రజలు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఐక్యమై బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారనీ, అదేవిధంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, మహిళలు, ఇతర రాష్ట్రాల ప్రజలంతా ఏకమై పోరాటాన్ని సాగిస్తారని అన్నారు. మేలో రైతులు పార్లమెంట్‌ను ఘెరావ్ చేయనున్నారని ఉగ్రహాన్ చెప్పారు.