Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ ఆదర్శంతో ముందుకెళ్దాం..
- రాజ్యాంగనిర్మాతకు అన్నదాతల నివాళి
- ఉద్యమస్థలిలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం
- కిసాన్ బహుజన్ ఏక్తా వర్థిల్లాలని నినాదాలు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగు చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న అన్నదాతల శిబిరాల్లో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగింది. కాగా, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో జరుగుతున్న రైతు ఉద్యమం బుధ వారం 137వ రోజుకు చేరింది. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరి రక్షణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఎస్కేఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే బుధవారం ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ కేంద్రాల్లో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. హికానాలోని దళిత సంస్థలు టిక్రీ సరిహద్దుకు చేరుకోవడం ద్వారా రైతుల ధర్నాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ప్రగతిశీల నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ఘాజీపూర్ సరిహద్దు, సింఘు సరిహద్దుకు చేరుకుని ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. సింఘు సరిహద్దులో పంజాబ్ ఎన్ఆర్ఈజీఎ మజ్దూర్ అసోసియేషన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిసాన్ బహుజన్ ఐక్యత వర్థిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ వర్థిల్లాలి, కిసాన్, దళిత, బహుజన్ ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు హౌరెత్తాయి.
రాజ్యాంగ పరిరక్షణకు, అమలుకు రైతు ఉద్యమం : రైతు నేతలు
రాజ్యాంగ పరిరక్షణకు, అమలుకు రైతు ఉద్యమం జరుగుతున్నదని రైతు నేతలు స్పష్టం చేశారు. దేశంలోని కార్మికులు, రైతులు, ఇతర కార్మికవర్గం వలస పాలనలో తీవ్రంగా దోపిడీకి గురయ్యారనీ, ఆ వ్యవస్థను మార్చడానికి సామాజిక విప్లవం రూపంలో రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు. సమానత్వం, న్యాయం, పురోగతి కోసం రాజ్యాంగంలో అనేక నిబంధనలు ఉన్నాయనీ, వీటిపై ప్రభుత్వాలు నిరంతరం దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. సంస్కరణల పేరిట రాజ్యాంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తున్నదని రైతు నాయకులు విమర్శించారు. ఈ నమూనా ఆర్థిక వ్యవస్థ, సమాజం రెండింటికీ ప్రమాదకరమ న్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమనీ, కానీ కేంద్రం చట్టాలు చేసిం దనీ, ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ, ప్రస్తుత రైతు ఉద్యమం రాజ్యాంగాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని బలంగా అమలు చేయడానికేనని తెలిపారు.
కిసాన్ బహుజన్ ఐక్యత దినోత్సవం
ఈ సందర్భంగా బహుజన్ నాయకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులు లేకుండా మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. మార్కెటింగ్ వ్యవస్థ, సరైన ఎంఎస్పీ రైతులకు అతిపెద్ద స్వేచ్ఛ అనీ, అదేవిధంగా కార్మికుల కనీస వేతనం, గౌరవప్రదమైన పని వారిని దోపిడీ నుంచి రక్షిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. కార్పొరేట్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు ఐక్యంగా ఉన్నారని తెలిపారు. అనేక కులాల మధ్య కార్మిక వర్గాన్ని విభజించడం ద్వారా ప్రభుత్వం ''విభజించు పాలించు'' విధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శించారు. ప్రస్తుతం కార్మికులు, రైతులు దీనిని బాగా అర్థం చేసుకున్నారనీ, వారు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతున్నారని దళిత, బహుజన్ నాయకులు వెల్లడించారు.