Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12వ తరగతి ఎగ్జామ్స్ తాత్కాలిక వాయిదా
- కరోనా ఉగ్రరూపంతో కేంద్రం కీలక నిర్ణయం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మేలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు. అలాగే, 12వ తరగతి పరీక్షలను
మాత్రం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా విజృంభణ కారణంగా వివిధ స్థాయిల్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, క్యాబినెట్ సెక్రెటరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని ప్రధాని చెప్పారని మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారన్నారు. 'మే 4 నుంచి దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నది. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 11రాష్ట్రాల్లో స్కూళ్ళు మూతపడ్డాయి' అన్నారు. సీబీఎస్ఈ సిలబస్ దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో పలు అంశా లను పరిగణనలోకి తీసుకొని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. మే 4నుంచి జూన్14 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను రద్దు తెలిపారు. బోర్డు రూపొందించే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా రిజల్ట్స్ ప్రకటిస్తామన్నారు. ఏవిద్యార్థి అయిన మార్కుల కేటాయింపుపై అభ్యంతరం ఉంటే, కరోనా పరిస్థితులు చక్కబడ్డ అనంతరం పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, 12వ తరగతి ఎగ్జామ్స్‌ను మాత్రం వాయిదా వేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కరోనా పరిస్థితులను జూన్ 1న సమీక్షిస్తామనీ, అనంతరం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలకు 15 రోజులు ముందుగానే తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.