Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఏఐపీఈఎఫ్ డిమాండ్
న్యూఢిల్లీ : విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెంటనే నిలిపేయాలని ఆఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) గురువారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (విద్యుత్ విభాగాలు)లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే చర్యలు మానుకోవాలని స్పష్టం చేసింది. విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు-2021, ప్రామాణిక బిడ్డింగ్ పత్రాలు (ఎస్బిడి) ఖరారు కాకుండానే.. చంఢఘీర్, దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయని ఏఐపీఈఎఫ్ పేర్కొంది. విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించేందుకు ఎస్బిడిలను కేంద్ర విద్యుత్ శాఖ గతేడాది సెప్టెంబర్ 22న వెబ్సైట్లో ఉంచిందని, దీన్ని దేశవ్యాప్తంగా వర్తింపజేస్తామని పేర్కొందని తెలిపింది. అయితే ఎస్బిడిలు ఇంకా ఖరారు కాలేదని విద్యుత్ మంత్రిత్వశాఖ తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానంలో చెబుతోందని ఏఐపీఈఎఫ్ పేర్కొంది. ఈ సమాధానంతో యుటిల్లో ప్రైవేటీకరణ ప్రక్రియకు సంబంధించి బిడ్డింగ్ ప్రాసెస్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది.
చంఢగీఢ్లో 100 శాతం ఈక్విటీ కోసం బిడ్డింగ్ ప్రక్రియ జరుతుండగా, దాద్రానగర్ హవేలీలో ఇది 51 శాతంగా ఉండడం గందరగోళ, అనిశ్చితి పరిస్థితులను సృష్టించిందని ఏఐపీఈఎఫ్ విమర్శించింది. ఏఐపీఈఎఫ్ చైర్మన్ శేలేంద్ర దూబే మాట్లాడుతూ.. దాద్రానగర్ హవేలీలో ఇప్పటికే బిడ్డింగ్ ప్రారంభమైందన్నారు. రూ.150 లక్షల రిజర్వ్ ధర ఉండగా రూ.555 లక్షల అత్యధిక ఆఫర్‌తో తాము బిడ్డింగ్‌ను గెలుచుకున్నట్లు టోరంటో సంస్థ ప్రకటించిందని తెలిపారు. దీనికి సంబంధించి ఒక పిల్ ధాఖలు కావడంతో తదుపరి ప్రక్రియపై బాంబే హైకోర్టు స్టే విధించింది. చంఢఘీర్‌లో గత మార్చి 18న టెక్నికల్ బిడ్లు ప్రారంభం కాగా, ఆర్థిక బిడ్డింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను సవాల్ చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈనెల 29న విచారణ జరగనుంది.