Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ఆడుకోవాల్సిన వయస్సులో 12 మంది మృగాళ్ల చేతిలో బలిపశువుగా మారింది. అండగా నిలవాల్సిన తల్లి...డబ్బులు తీసుకుని మిన్నకుండిపోయింది. తండ్రి తర్వాత అంతటి హోదాలో ఉండాల్సిన బావ సైతం బాలికను కబళించాడు. మానవతా విలువలు మండగల్పిన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 14 ఏళ్ల మైనర్పై 12 మంది మానవ మృగాలు రెండేళ్లకు పైగా లైంగికదాడికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నమక్కల్ జిల్లాలోని తిరుచెన్గోడ్లో తన అక్కతో కలిసి జీవిస్తున్న మైనర్పై బావతో పాటు మరో 11 మంది ఈ కిరాతకానికి పాల్పడ్డారు. జిల్లా ప్రొటెక్షన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లితో పాటు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తండ్రి రోగాన పడటం.. తల్లి రోజువారీ కూలి కావడంతో... ఆరవ తరగతి మధ్యలో ఆపేసిన బాధితురాలు.. కుటుంబ పోషణ నిమిత్తం ..అక్క, బావల వద్ద ఉంటూ...ఇంట్లో పనులు చేసేందుకు వెళుతుండేది. ఆ సమయంలో బావతో పాటు ఆయన స్నేహితులు, తాను పనిచేస్తున్న ఇంటి ఓనర్ పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే నిందితులకు బాధితురాలి తల్లి కూడా మద్దతు తెలిపేదని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లా ప్రొటెక్షన్ అధికారి నుంచి ఫిర్యాదు అందగా..విచారణ జరిపామని, బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఇంజనీర్తో సహా 12 మంది ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. కుమార్తె జరుగుతున్న అరాచకం తెలిసి కూడా తల్లి మిన్నకుండిపోయారని చెప్పారు. కుమార్తె జరుగుతున్న అఘాయిత్యాల గురించి బయటకు పొక్కకుండా ఉండేందుకు నిందితులు ఆమెకు రూ. 10 వేలు ముట్టజెప్పారని పోలీసులు చెబుతున్నారు. తల్లితో సహా 12 మంది నిందితులను అరెస్టు చేసి...నమక్కల్ సబ్ జైలులో ఉంచినట్టు చెప్పారు.