Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీలేని స్మశాన వాటికలు
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయ. ఢిల్లీలోనే అతిపెద్దదైన స్మశాన వాటిక నిగమ్‌బోధ్ ఘాట్‌లో అత్యధికంగా రోజుకి 15 నుంచి 30 మంది కరోనా మృతులకు దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కరోనాతో మరణించిన తన తాత మృతదేహాన్ని దహనసంస్కారాల కోసం గౌతమ్ అనే వ్యక్తి బుధవారం ఉదయం 8.30 నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకువచ్చాడు. ఐదు గంటలు గడిచినా అక్కడ స్థలం లేకపోవడంతో వేచిచూడాల్సి వచ్చింది. బుధవారం ఉదయం ఇక్కడికి వచ్చామని.. ఐదు గంటలు గడిచినా ఇప్పటివరకు ఖాళీ లేదని.. ఒకే అంబులెన్స్‌లో ఇద్దరు, ముగ్గురి మృతదేహాలను ఇక్కడికి తీసుకువస్తున్నారని గౌతమ్ అన్నారు. దీంతో ఢిల్లీలో కరోనా వేగంగా విజృంభిస్తోందని అర్థమౌతోంది. ప్రజలు చివరిస్టేజ్లో ఆస్పత్రికి వస్తున్నారని.. వైద్యం అందుతున్నా పరిస్థితి విషమంగా మారుతోందని.. దీంతో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డా. రిత్విక్ రాజ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్లో కొరత కూడా అధికంగా ఉంది. బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి ఢిల్లీలోని వెంటిలేటర్స్‌తో కూడిన ఐసియు బెడ్స్ 85 శాతం కరోనా బాధితులతో నిండిపోగా, వెంటిలేటర్స్ లేని ఐసియు బెడ్స్ 88శాతం రోగులతో నిండిపోయాయని వైద్యులు తెలిపారు.
బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో అత్యధికంగా 104మంది కరోనాతో మరణించారు. నవంబర్ 20 అనంతరం అత్యధిక కరోనా మరణాలు ఇవే కావడం గమనార్హం. అదేరోజున దేశంలో రికార్డుస్థాయిలో 1027 మంది మరణించారు. గతేడాది అక్టోబర్న 1,033 మంది కరోనాతో చనిపోయారు. అనంతరం దేశంలోనే అత్యధిక కరోనా మరణాలుగా రికార్డయ్యాయి.
కరోనా హాట్‌స్పాట్స్‌గా మారిన ఢిల్లీ జైళ్లు
ఢిల్లీలోని అతిపెద్ద జైళ్లైన తీహార్, మండోలీ, రోహిణీ జైళ్లు కరోనా హాట్‌స్పాట్‌గా మారాయి. గత కొన్ని వారాలుగా ఈ మూడు జైళ్లలో కరోనా కేసులు గతంలో కంటే ఐదు రెట్లు పెరిగాయి. మూడు జైళ్లలోనూ కలిపి మొత్తంగా 20వేల మంది ఖైదీలు ఉన్నారు. వారికి విధిగా కరోనా పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్ చేయడం, చికిత్స నందించడం ఇబ్బందికరంగా మారింది. వీరిలో కొంతమందిలో కరోనా లక్షణాలు లేకపోవడం, వారి నుండి వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందడంతో జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది 500 మంది ఖైదీలతో పాటు పలువురు జైలు సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక బెయిల్, ప్రత్యేక పెరోల్ మీద ఐదువేలకు పైగా ఖైదీలను ఈ జైళ్ల నుంచి విడుదల చేశారు.
వీరంతా తిరిగి జైళ్లకు చేరుకోవడంతో ఖైదీల సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఈ మూడుజైళ్లలోని 190 మంది ఖైదీలకు కరోనా సోకగా, ఇద్దరు మరణించారు. 190 మంది కరోనా బాధితుల్లో 121 మంది కోలుకున్నారని, వీరిలో 67 మంది చికిత్స పొందుతున్నారనీ, ఇద్దరు ఖైదీలు మరణించినట్టు జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపారు. 304 మంది జైలు సిబ్బంది కరోనా బారిన పడ్డారనీ, వారిలో 293 మంది కోలుకోగా, మిగిలిన వారు వైద్య చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. పరీక్షలు నిర్వహించగా. ఇద్దరికి పాజిటివ్‌గా నిర్థారణైంది. సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడకుండా తమను తాము రక్షించుకుంటూనే విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య అధికంగా ఉండటంతో.. అధిక శాతం మంది కరోనా బారిన పడుతున్నట్టు వెల్లడించారు.
జైలు వైద్యులూ కరోనా బాధితులే..
మండోలి జైలు సూపరింటెండెంట్‌తో పాటు ఇద్దరు ఇన్‌హౌస్ వైద్యులకి కూడా కరోనా సోకిందని అధికారులు తెలిపారు. గత కొన్ని వారాలుగా ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈ మూడు జైళ్లలోనూ ఏప్రిల్ ఐదున 11 పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా, ఏప్రిల్ 12 నాటికి ఈ సంఖ్య 59కి పెరిగిందని జైలు అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు తీహార్ జైలు సిబ్బందితో పాటు వైద్యులు కూడా ఉన్నారు. దీంతో వైద్యుని సంప్రదించిన ఖైదీలందరినీ క్వారంటైన్‌కు పంపినట్లు తెలిపారు. అయితే ట్రేసింగ్, పరీక్షలు, క్వారంటైన్ సమస్యగా మారిందని, పలువురిలో లక్షణాలు కనిపించడం లేదని, కానీ కరోనా పాజిటివ్‌గా రిపోర్టులో వస్తుందని అన్నారు.
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ బాధితులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూలకు సిద్ధమైంది. కరోనా వ్యాప్తిని అంతమొందించేందుకు శుక్రవారం నుంచి వారాంతాల్లో కర్ఫ్యూను విధిస్తున్నామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం పేర్కొన్నారు. అవసరమైన కార్యకలాపాలు ముఖ్యంగా ఇప్పటికే ప్రణాళిక చేసుకున్న వివాహాలు పాస్‌లతో అనుమతించనున్నట్లు తెలిపారు. ఆడిటోరియం, రెస్టారెంట్లు, మాల్స్, జిమ్స్, స్పాలు మూతపడనుండగా... సినిమా థియేటర్లు మాత్రం సామర్థ్యంలో మూడవ వంతు ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలు అమ్మడంపై నిషేధం విధించారు. హోమ్ డెలివరీలు, రెస్టారెంట్లకు వచ్చి తీసుకు వెళ్లడానికి అనుమతినిచ్చారు. వారాంతపు మార్కెట్లకు షరతులతో కూడిన అనుమతినిచ్చారు. మతపరమైన, సామాజిక, రాజకీయ సమావేశాలపై నిషేధం విధించారు. వివాహాలకు 50 మంది మించరాదు. అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు.
ఈ నిబంధనలన్నీ మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసమేనని, అసౌకర్యంగా అనిపించినప్పటికీ కరోనా వైరస్ గొలుసును తుంచేందుకు ఇవీ తప్పనిసరి అని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఎవరూ భయాందోళన చెందవద్దని, ఈ వారాంతాల్లో నిత్యావసర వస్తువులన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కుంభమేళాకు వచ్చి...
డెహ్రెడూన్ : ప్రస్తుతం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనడానికి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక అఖరా మహమండలేశ్వర్ కరోనాతో మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని మహ నిర్వాణి అఖరాకు చెందిన మహమండలేశ్వర్ స్వామి కపిల్దేప్ కుంభ మేళా కోసం వచ్చారు. ఆర్టి పిసిఆర్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితం రావడంతో ఇక్కడి కైలాష్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 13న స్వామి కపిల్‌దేవ్ మరణించినట్లు నగర ఎస్పి సరితా దోభాల్ గురువారం తెలిపారు. హరిద్వార్ కుంభమేళా ప్రాంతంలో ఈ నెల 10 నుంచి 14 వరకూ 1,701 మంది కరోనా బారీనపడినట్లు పరీక్షల్లో వెల్లడయింది.
ఈ ఐదు రోజుల్లో 2,36,751 పరీక్షలను నిర్వహించారు. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. హరిద్వార్, తెహ్రి, డెహ్రడూన్ జిల్లాలో 670కు పైగా ఎకరాల్లో ఈ కుంభమేళా ప్రాంతం విస్తరించిఉంది. ఈ నెల 12, 14 తేదీల్లో రాయల్ బాత్స్ సందర్భంగా సుమారు 48.51 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రజలు ఈ మేళాలో పాల్గొంటున్నారు.
కరోనాను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి:మోడీకి ఉద్ధవ్ థాకరే లేఖ
కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డిఆర్ఎఫ్)ని అందించడంతో .. మహమ్మారి నుండి ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మందులు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో... సైన్యం సహాయం అందించాలని ఉద్ధవ్‌థాకరే ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ తరహా నిబంధనలు విధించారు. అదే సమయంలో లాక్డౌన్ ద్వారా ఉపాధికోల్పోతున్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు సహాయం అందించేందుకు రూ. 5,476 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
భూకంపం, తుఫానులు, వరదల వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినపుడు తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాల ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం నిధిని ప్రకటిస్తాయని అన్నారు. అదేవిధంగా కరోనాను కూడా ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని అన్నారు. కాగా, ఉద్ధవ్‌థాకరే లేఖ రాసినట్లు ప్రధాని మోడీ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే ధృవీకరించారు. ఈ లేఖపై ఆయన స్పందిస్తూ.. మహమ్మారి ఒక విపత్తు వంటిదే.. అయితే దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించలేదని.. దీంతో రాష్ట్రాలకు నిధిని కేటాయించలేమని అన్నారు. మహమ్మారిని ప్రకృతి విపత్తుగా పరిగణించడం అనేది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని. కేంద్రం పిలుపునివ్వాల్సి వుంటుందని చెప్పారు.
కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదబాద్ జిల్లాలో సంసర్‌గంజ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం కరోనా సోకిన 46 ఏళ్ల రెజౌల్ హక్యూ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5 గంటలకు మృతి చెందారు. సంసర్‌గంజ్ స్థానంలో ఓటింగ్‌పై ఎలక్షన్ కమిషన్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఐదో దశలో భాగంగా ఈ నెల 17న ఈ స్థానానికి ఓటింగ్ జరగాల్సి ఉంది.
ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ కరోనా చికిత్స
మహారాష్ట్రలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడంతో అంబులెన్స్‌ల్లోనే ఎదురు చూస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫైవ్‌స్టార్ హోటళ్లను కరోనా ఆస్పత్రులుగా మార్చేందుకు సిద్ధమైంది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ముంబయి ఆసుపత్రులు ఫైవ్‌స్టార్ హోటళ్లను వినియోగించుకోనున్నట్లు నగర వైద్యారోగ్య యంత్రాంగం గురువారం ప్రకటించింది. దీంతో అత్యవసరమైన రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల్లో చాలా మందికి అత్యవసర వైద్య చికిత్స అవసరం ఉండట్లేదు. కానీ, వారిని కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం వల్ల ఎమర్జెన్సీ రోగులకు బెడ్లు దొరకట్లేదు. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రులు ఫోర్స్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకుని వాటిని తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చనున్నాయని.. దీంతో స్వల్ప లక్షణాలు ఉన్న రోగులను హోటళ్లకు తరలించవచ్చని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఆసుపత్రులు ఖాళీలేక రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.