Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నియంత్రణ లేనివిధంగా ఉధృతమౌతున్న నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తిని, మరణాల సంఖ్యను తగ్గించేందుకు, దేశంలో నెలకొన్న వైద్య సదుపాయాల కొరతను అధిగమించేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల సమయంలో నిబంధనలు పాటించట్లేదని ప్రజలను నిందించడం ద్వారా లేదా వ్యాప్తి నిందను రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోరాదని పేర్కొంది. అన్ని తరహాల సామూహిక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధం విధించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఎన్నికల ప్రచార సమావేశాల్లో కూడా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని డిమాండ్ చేసింది. అత్యవసర ప్రాతిపదికన వైద్య సౌకర్యాలు పెంచేందుకు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు అదనపు నిధులతో పాటు పీఎం కేర్స్ కింద సేకరించిన నిధిని వెంటనే విడుదల చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రజల జీవనోపాధిపై కష్టాలను మరింతగా పెంచే విధంగా ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు నెలకు రూ.7,500 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ చేయడంతో పాటు, అవసరమైన వారందరికీ ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలని, అదేవిధంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని సత్వరమే ప్రారంభించాలని పేర్కొంది. పైన పేర్కొన్న చర్యలను యుద్ధ ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి పొలిట్‌బ్యూరో సూచించింది.