Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనకరంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి
- 14 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
- మళ్లీ ఆంక్షల దిశగా రాష్ట్రాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం రోజురోజుకు ఉధృతమవుతోంది. తాజాగా మన దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మొదటి దశలో కంటే రెండో దేశలో వైరస్ వ్యాప్తి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. నెల క్రితం వరకు 10 వేలకు అటుఇటుగా ఉన్న కేసులు, పది రోజుల క్రితం నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాయి. 10 రోజుల క్రితం దాదాపు లక్షగా ఉన్న కేసులు పది రోజుల్లోనే రెట్టింపై 2 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలో 2,00,739 కేసులు నమోదయ్యాయి. 1,038 మంది మరణించారు. గతేడాది అక్టోబర్ 3 తర్వాత ఇంత మొత్తంలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా, మరణాల సంఖ్య 1,73,123కు పెరిగింది.
రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తాజాగా 2 లక్షలకు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,71,877(మొత్తం కేసుల్లో 10.46 శాతం)గా ఉంది. ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు..ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా తర్వాత భారత్ మాత్రమే ఉంది. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా మూడు లక్షలకు పైగా రోజూవారీ కేసులు వెలుగుచూడగా, తాజాగా మన దేశంలో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షలకు పైబడింది.
రాజస్థాన్‌లో నైట్ కర్ఫ్యూ..యూపీలో పరీక్షలు రద్దు
కరోనా విలయ తాండవం నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. నైట్, వారాంతపు కర్ఫ్యూలతో పాటు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్‌కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని, మార్కెట్లు, ఇతరత్రా అన్నింటినీ సాయంత్రం 5 గంటలకే మూసేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఈనెల 16 నుంచి 30 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివుంటాయని తాజా నిబంధనల్లో పేర్కొంది. పంక్షన్లు, వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్య 50కు పరిమితం చేసింది. వచ్చే నెల 15 వరకు అన్ని పాఠశాలలను మూసివేయడంతో పాటు 10, 12 తరగతులు బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
రాజస్థాన్‌లో కూడా పరీక్షలు లేకుండా 5, 8, 10 తరగతుల విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు సిఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. 12వ తరగతి పరీక్షలపై తదుపరి పరిస్థితులనుసారం నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు.
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ
కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో మాల్స్, జిమ్‌లు, ఆడిటోరియంలు, స్పా సెంటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా థియేటర్లను 30 శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.