Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు
- పీఎస్‌బీలపై వేటుకు అడ్డంకులు లేకుండా చర్యలు
- బ్యాంకుల జాతీయీకరణ చట్టాలను రద్దు చేసే యోచన
న్యూఢిల్లీ : కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రయివేటీకరణ చట్టాలను సవరించడానికి మోడీ సర్కార్ యోచిస్తున్నది. అందులో భాగంగానే రానున్న వర్షకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రయివేటీకరణకు అవసరమైన చట్టాల్లో మార్పులను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ సంప్రదింపులు ప్రారంభించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. సంబంధిత చట్టాలను ఒకేసారి సవరించడానికి ప్రణాళిక ఉందనీ, తద్వారా పీఎస్బీ ప్రయివేటీకరణ ప్రక్రియకు చట్టపరమైన అడ్డంకులు ఏర్పడకుండా కేంద్రం చూస్తున్నదని స్పష్టమైంది. బ్యాంకులను జాతీయం చేస్తూ 1970, 1980ల్లో తీసుకొచ్చిన బ్యాంకింగ్ కంపెనీల చట్టాలను రద్దు చేయాలన్నదానిపైనా ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వేతర వాటాదారుణనికి ఓటింగ్ హక్కును కల్పిస్తారని ఆయా వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీకరించే ప్రభుత్వ ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కువ పీఎస్‌బీలను ప్రయివేటీకరించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. ప్రయివేటీకరణ కోసం నిటి ఆయోగ్ కొన్ని పీఎస్‌బీలను గుర్తించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో రెండు బ్యాంకుల ప్రయివేటీకరణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకుల జాతీయీకరణ చట్టాలను రద్దు చేయడానికి ముందు, ఈ చట్టాల క్రింద నుంచి పీఎస్‌బీలను కంపెనీల చట్టం కింద మార్చడానికి ఒక విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి పూర్వపరాలను అధ్యయనం చేస్తున్నారు. జాతీయం చేసిన పీఎస్‌బీలు ఇంతవరకు అలాంటి చర్యకు దూరంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఐడీబీఐ బ్యాంక్‌లతో సహా 5-6 బ్యాంకులు ఏదో ఒక సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. కానీ జాతీయం చేసిన బ్యాంకులు కాదు. అందువల్ల వాటి ప్రయివేటీకరణ చాలా సులువుగా అయిపోయింది. సంప్రదింపులు, చట్టపరమైన అభిప్రాయం కోరిన తరువాత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బ్యాంకుల జాతీయీకరణ చట్టాలు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సంబంధించి చట్ట సవరణలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
1970లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 14 ప్రయివేటు బ్యాంకులను జాతీయీకరణ చేసింది. తరువాత 1980లో మరో ఆరు బ్యాంకులను కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వమే జాతీయీకరణ చేసింది. నిధులు సమకూర్చే పనిలో ప్రయివేట్, కార్పొరేట్ వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వరంగం పట్టును తొలగించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇటీవల బీపీసీఎల్ ప్రయివేటీకరణకు మార్గం సుగమం చేయడానికి ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్థలాల్లో కన్సాలిడేషన్ ప్రక్రియలను చేపట్టింది. ఫలితంగా ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గింది. కొత్త వ్యూహాత్మక రంగ విధానం ప్రకారం ప్రభుత్వం చివరికి గరిష్టంగా నాలుగు ప్రభుత్వ బ్యాంకులను మాత్రమే ఉంచుతుంది. మిగతా బ్యాంకులను ప్రయివేటీకరించడం, విలీనం చేయడం చేస్తుంది.
దేశంలో నాలుగు అగ్ర బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ప్రభుత్వ రుణదాతలపై నియంత్రణ నిలుపుకోవాలని ప్రభుత్వాన్ని నిటి ఆయోగ్ కోరింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాంక్‌లను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రయివేటీకరించాలని నిటి ఆయోగ్ సూచించింది. మిగిలిన ఐదు పీఎస్‌బీలు బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లను ప్రభుత్వం తమ వాటాను నిర్ణీత కాలపరిమితిలో 26శాతం నిలుపుకోవటానికి, ఉపసంహరించుకోవడానికి ఎంచుకున్న నాలుగు పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయొచ్చని నిటి ఆయోగ్ ప్రతిపాదించింది.
రెండు బ్యాంకుల ప్రయివేటీకరణపై చర్చ
ఈ ఏడాది రెండు బ్యాంకులను ప్రయివేటీకరిస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఆ రెండు ప్రభుత్వ బ్యాంకులను గుర్తించి, ప్రైవేటీకరణ చేసేందుకు కీలక సమావేశం జరిగింది. నిటి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ అధికారులు సమావేశమయ్యారు. నిటి ఆయోగ్ ఇప్పటికే నాలుగు నుంచి ఐదు బ్యాంకుల పేర్లను ప్రయివేటీకరణ కోసం సూచించింది. వాటిలో రెండు బ్యాంకుల పేర్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, రుణభారం మరియు కొన్ని ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిటి ఆయోగ్ ఒక వివరణాత్మక నివేదికను తయారుచేసింది. నిటి ఆయోగ్ సిఫార్స్ చేసిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ-ఇండియా ఓవర్సీస్ బ్యాంక్), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బోఐ-బ్యాంక్ ఆఫ్ ఇండియా), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. వీటిలో ప్రయివేటీకరణ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ రెండు బ్యాంకులపై మొదట క్యాబినెట్ కార్యదర్శి నేతత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ డిజిన్విస్టెమెంట్ (సీజీడీ) సమీక్షించాయి.
బ్యాంకుల ప్రయివేటీకరణ మంచిదేనా?
బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు బ్యాంకులను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని బ్యాంకింగ్ రంగ నిపుణుడు అశ్వీని రానా అన్నారు. ప్రభుత్వం ఒక స్వావలంబన భారతదేశం గురించి మాట్లాడుతుందనీ, కాని ఈ కల నెరవేర్చడంలో ప్రభుత్వరంగ బ్యాంకుల మాదిరిగా ప్రయివేట్ బ్యాంకులు తోడ్పడవని అన్నారు. బ్యాంకులను జాతీయం చేయడానికి ప్రధాన కారణం దేశంలోని ప్రయివేట్ బ్యాంకుల పురోగతికి తోడ్పడకపోవడమేనని అన్నారు. జాతీయం చేయడానికి ముందు 700కి పైగా బ్యాంకులు అప్పుల్లో మునిగిపోయాయి. ఎప్పటికప్పుడు పెద్ద ప్రయివేట్ బ్యాంకుల పరిస్థితి క్షీణిస్తున్న సందర్భంలో ఈ బ్యాంకులను ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తోంది.