Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు వద్ద లేని సరైన ప్రణాళిక
- మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి
- పలు రంగాలపై ప్రభావం చూపే ప్రమాదం
- ఆర్థిక నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశాన్ని మళ్లీ చుట్టేస్తున్నది. సెకండ్‌వేవ్‌తో దేశంలో కరోనా బాధితుల సంఖ్యను పెంచుతున్నది. దాదాపు ఏడాది క్రితం దేశంలో తీవ్ర రూపం దాల్చిన మహమ్మారి మళ్లీ ఇప్పుడు అదే దారి పట్టడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితిపై వ్యాపార, వాణిజ్యవేత్తలు, ఆర్థికవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందనీ, అయితే మోడీ ప్రభుత్వం మాత్రం వీటి నుంచి పాఠాలు నేర్వడంలేదని అన్నారు.
'ఆర్థిక స్థిరత్వానికి తగిన చర్యలు తప్పనిసరి' సెకండ్ వేవ్ కొత్త ఉప్పెనతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నదనీ, అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి తగిన రీతిలో సన్నాహాలు కనిపించడంలేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే కచ్చితమైన ప్రణాళికతో పాటు ప్రధానంగా నిర్ణీత రాజకీయ సంకల్పం అవసరమని వివరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి వాణిజ్య, వ్యాపార పరిశ్రమలపై ప్రభావం పడుతుందనీ, వీటిని ప్రభుత్వాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆర్థికవేత్తలు సూచించారు. ఇందులో భాగంగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం, ఉచిత ఆహార ధాన్యాలు, ఇతర ముఖ్యమైన ఆహార పదార్థాలు, పరీక్షలు, టీకాలతో సహా ఉచిత ఆరోగ్య సంరక్షణ, పిల్లల చదువుల కోసం ఉచిత, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ వంటి చర్యలు చేపట్టాలనీ, ఇవి ప్రత్యక్షంగా సదరు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికవ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆర్థిక నిపుణులు తెలిపారు.
జీడీపీలో ఖర్చు చేసింది మూడు శాతమే..!
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి వచ్చిన తాజా సమాచారం ఆధారంగా... ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సహాయం కింద కేంద్రం గతేడాది దేశ జీడీపీలో 3.1శాతం వరకు ఖర్చు చేసింది. అయితే ఈ ఖర్చు అన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సగటు కంటే తక్కువ. చైనా (4.7శాతం), దక్షిణాఫ్రికా (5.5శాతం), బ్రెజిల్ (8.3శాతం) వంటి దేశాలు భారత్ కంటే అధికంగా ఖర్చు చేసిన విషయాన్ని నిపుణులు గుర్తు చేశారు. గతేడాది కోవిడ్ మహమ్మారితో పాటు లాక్డౌన్ నుంచి దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోలేదని చెప్పారు. సీఎంఐఈ అంచనాల ప్రకారం.. ఏప్రిల్‌లో నిరుద్యోగం ఇప్పటికీ 7.1 శాతం వద్ద ఉన్నదని వివరించారు. అలాగే, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.6శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరమని ఆర్థిక నిపుణులు చెప్పారు. అలాగే, 2020-21 ఏడాదికి జీడీపీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 8శాతం తక్కువగా ఉంటుందనీ, ప్రయివేటు వినియోగ వ్యయం దాదాపు 9శాతం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
'లేకపోతే తీవ్రపరిణామాలు..'
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభణ ఘోరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆర్థికవేత్తలు చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తి మరింత పడిపోవచ్చని చెప్పారు. పెట్టుబడులు కచ్చితంగా మందగిస్తాయనీ, ప్రయివేటు వినియోగ వ్యవయం మళ్లీ తగ్గుతుందని తెలిపారు.
అలాగే, దేశవ్యాప్తంగా మరోసారి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారనీ నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికైనా మోడీ సర్కారు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలనీ, ఊహల గణాంకాలు, అంచనాలకు పరిమైతే భారత్ మరోసారి ఆర్థికంగా మరింత కుదేలవుతుందని హెచ్చరించారు.