Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమాంతంగా ఎగిసిపడ్డ అగ్నికీలలు
- రైతుల అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
- బీజేపీ శ్రేణుల హస్తం ఉంటుందన్న రైతు నేతలు
పొమ్మనలేక పొగబెడుతున్నారన్నట్టుగా రైతుల గుడారాలకు నిప్పుపెట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లు మొదలుకుని అన్నదాతల ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్న కాషాయప్రేరిపిత శక్తుల హస్తం ఉండొచ్చని రైతునేతలు భావిస్తున్నారు. గత 138 రోజులనుంచి నల్లచట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. బీజేపీకి ఓటువేయవద్దని ఎన్నికలు జరిగేప్రాంతాల్లో రైతులు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తున్న రైతుల్ని ఎలాగైనా తరిమేయాలని చూస్తున్న బీజేపీ పాలకులే..వెనుకుండి గుడారాలకు మంటలు పెట్టించిఉంటారన్న చర్చ రైతుల్లో వ్యక్తమవుతున్నది. మాప్రాణాలు పోయినా సరే ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ దీక్షాస్థలిలోని రైతులు స్పష్టం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న రైతుల శిబిరాల్లోని గుడారాలకు దుండగులు నిప్పు పెట్టారు. సింఘు సరిహద్దు వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గురువారం మధ్యాహ్నం ఈ దారుణానికి ఒడిగట్టారు. ఎర్రటి ఎండ మండుతుంటే... మంటలు అమాంతం ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తం అయిన రైతులు చెలరేగిన మంటలను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ మూడు గుడారాలు, ఒక కారు పూర్తిగా కాలిపోయాయి. ఆ రెండు గుడారాల్లో ఉన్న ఫర్నీచర్, సామాన్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రైతుల అప్రమత్తతతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఇలాంటి ఘటన జరగటం ఇది తొలిసారి కాదు. గతంలోనూ జరిగాయి. వాటిని రైతులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ ఘటనలోనూ రైతులు ముందుగానే మేల్కొవటంతో పెను ప్రమాదం తప్పింది. దుండగులపై రైతులు కుండ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ కేసు నమోదు చేయలేదు.
'మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక గుడారం దగ్గర కనిపించాడు. అతను ఒక టెంట్‌కు నిప్పంటించాడు. మంటలు చూసిన రైతులు వెంటనే నీటితో వాటిని ఆర్పేందుకు పరుగులు పెట్టారు. ఈ లోపు ఇంకోవ్యక్తి మరొక గుడారానికి నిప్పంటించి పారిపోయాడు. రైతుల బృందం అతన్ని
పట్టుకునేందుకు ప్రయత్నించారు.. కానీ తప్పించుకున్నాడు..' అని రైతు నేత ఒకరు తెలిపారు. 'బీఆర్టీఎస్ వైపు నుంచి వచ్చిన వ్యక్తులు రెండు గుడారాలకు నిప్పంటించారని మాకు ఫిర్యాదు అందింది. రైతులు వీటిని నిర్మించుకునుఆ్నరు. అందులో వారు తమ సామాను పెట్టుకున్నారు. ఎయిర్ కూలర్లను ఏర్పాటుచేశారు. ఈ గుడారాల్లో కొంత ఫర్నిచర్ ఉన్నది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గంటలోపే మంటలు చెలరేగాయి' అని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రైతులు సకాలంలో మంటలను ఆర్పివేశారని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి మూడు టెంట్ల నుంచి మంటలు సంభవించాయని, కొద్ది సమయంలోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని స్థానికులు పేర్కొన్నారు. రైతులంతా అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేదంటే ఘోరం జరిగేదని అంటున్నారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు గురువారం నాటికి 138 రోజుకు చేరింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన ఘాజీపూర్, పల్వాల్, హర్యానా-రాజస్థాన్ సరిహద్దు షాజహాన్‌పూర్ వద్ద రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.