Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నిదారులూ వెదకమని విదేశాంగ శాఖకు ఆదేశాలు
న్యూఢిల్లీ : హాస్పిటల్స్‌లో ఆక్సీజన్ కొరత పెద్ద ఎత్తున ఉందని అన్ని రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం జాగ్రత్త చర్యలకు దిగింది. దేశంలో నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, వెంటనే 50వేల మెట్రిక్ టన్నుల ఆక్సీజన్‌ను దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని దారులూ ఉపయోగించాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ వణికిపోతోంది. కేసుల సంఖ్య 1.42కోట్లను దాటింది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన రెండో దేశంగా నేడు భారత్ నిలబడింది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైద్య సేవల కోసం హాస్పిటల్స్‌కు తండోపతండాలుగా వైరస్ బాధితులు వస్తున్నారు. అయితే, హాస్పిటల్స్‌లో బెడ్లు ఖాళీగా లేక, మందులు, ఔషధాలు, ఆక్సీజన్ వంటివి లేక..ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఒక భయానక వాతావరణం నెలకొంది. చాలామంది పేషంట్ల బంధువులు సామాజిక మాధ్యమంలో పలు వీడియోలు పోస్ట్ చేసి, సాయం అడుగుతున్నారు. తాజాగా కేంద్ర వైద్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వైరస్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించామని తెలిపారు.
12 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ఆక్సీజన్, ఇతర మందులకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఆక్సీజన్ ఉత్పత్తి సామార్థ్యం, రాష్ట్రాల డిమాండ్‌పై ఒక మ్యాప్ తయారుచేశామని, ఈ 12 రాష్ట్రాలకు ఏప్రిల్ 20న 4880 మెట్రిక్ టన్నులు, ఏప్రిల్ 25న 5619 మెట్రిక్ టన్నులు, ఏప్రిల్ 30న 6593 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ అవసరమవుతుందని కేంద్రం అంచనావేసింది.