Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు
గుంటూరు: 'సీపీఐ(ఎం) ఏపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఖబడ్దార్... ఎంతటివారైనా సహించేది లేదు' అంటూ సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో సీపీఐ(ఎం) జెడ్పీటీసీ అభ్యర్థి చీఫ్ ఏజెంటు అలమోతు సుందరయ్యపై వైసీపీకి చెందిన వారు కులదూషణకు పాల్పడ్డంతో పాటు దాడి చేశారు. బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం ముప్పాళ్లలో బహిరంగ సభ అనంతరం కాలినడకన మధు లంకెలకూరపాడుకు బయలుదేరారు. పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వారిని దాటుకుని గ్రామం వద్దకు వెళ్లిన నాయకులను అప్పటికే ఊరివెలుపల భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మధుతో పాటు సీపీఐ(ఎం), దళిత సంఘాల నాయకులు అక్కడే బైఠాయించారు. రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని సత్తెనపల్లి పట్టణ సీఐ విజరుచంద్ర హామీనివ్వ డంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి గద్దె చలమయ్య, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ఎన్.వేణుగోపాల్, డి.జ్ఞాన్రాజ్పాల్, కేవీపీఎస్ పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి సిహెచ్.నాగమల్లేశ్వరరావు, పౌరహక్కుల సంఘం నాయకులు చిలక చంద్రశేఖర్, దళిత, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.