Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ తప్పుడు ఫలితాలు
- రోగిలో కరోనా ఉన్నప్పటికీ 'నెగెటివ్' రిజల్ట్స్
- వైరస్ ఉత్పరివర్తనానికి తగ్గట్టు టెస్టుల్లో
- మార్పులు చేయకపోవడమే ప్రధాన కారణం!
- పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న రోగులు
స్రవంతి
పొడి దగ్గు.. ఆ తర్వాత జ్వరం.. ఒంట్లో నొప్పులు కూడా కొద్దిగా ప్రారంభమయ్యాయి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మొదలైంది.. కరోనా సోకిందేమోనని మను జోషి (పేరు మార్చాం) భావించాడు. వెంటనే కొవిడ్-19 పరీక్షా కేంద్రానికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నాడు. ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. అయితే, ఈ పరీక్షలో వైరస్ ఉనికి పూర్తిస్థాయిలో తెలియదు అన్న కొన్ని వార్తలు గుర్తొచ్చి.. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకున్నాడు. అందులో కూడా నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో తనకు కరోనా లేదని నిర్దారించుకొని ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం అయ్యింది. ఊపిరి తీసుకోవడం మరింత కష్టం అయ్యింది. లక్షణాలు తీవ్రతరం అయ్యాయి. పరిస్థితి దిగజారడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యులు మనుకు కరోనా సోకినట్టు తేల్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదుగురు కరోనా రోగుల్లో ఒకరు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఎందుకు ఇలా?
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో కరోనా వైరస్ ఉనికిని దాదాపుగా నిర్ధారించవచ్చు. అయితే, గత 15 నెలల్లో కరోనా కొన్ని వందల ఉత్పరివర్తనాలకు లోనైంది. ఈ స్ట్రెయిన్లకు తగినట్టు ల్యాబ్ పరీక్షల్లో (యాంటిజెన్, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో) మార్పులు జరుగలేదు. ప్రస్తుతం దేశంలో నిర్వహిస్తున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష విధానం.. చైనాలోని వుహాన్ సిటీలో జనవరి 5, 2020న గుర్తించిన వైరస్‌కు అనుగుణంగా డిజైన్ చేశారు. ఇప్పుడు మహమ్మారి ఎన్నో ఉత్పరివర్తనాలకు లోనైంది. అయినప్పటికీ, పరీక్షల్లో మార్పులను చేపట్టలేదు. దీంతో దేశంలో కొత్త మ్యూటెంట్ వైరస్.. కరోనా పరీక్షలకు చిక్కడం లేదు. ఇదే విషయాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలియానిస్, మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ధవీకరించారు.
ముక్కు, నోటి నమూనాలు నిక్కచ్చివేనా?
ఒక వ్యక్తికి కరోనా సోకినప్పటికీ, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ రావడానికి ముక్కు, నోటి నుంచి తీసుకుంటున్న నమూనా విధానం కూడా కారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో విస్తరించిన కొన్ని స్ట్రెయిన్లు రోగి ముక్కు, నోటిలోని ద్రవాల్లో నివాసం ఉండట్లేదు. అయితే, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో ఈ భాగాల నుంచే నమూనాలను తీసుకోవడంతో.. రోగిలో వైరస్ ఉన్నప్పటికీ, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ ఫలితం వస్తున్నదని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభ కాలే తెలిపారు. ఇలా, పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టులు రావడంతో, తమకు కరోనా లేదని నిర్ధారించుకున్న కొందరు.. పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో మార్పులను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.