Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సెకెండ్‌వేవ్‌తో భారత్ మృత్యుఒడిలోకి చేరుకుంటున్నది. రెండో రోజూ రెండు లక్షలకుపైగా కేసులు నమోదుకాగా.. మరణాలూ వెయ్యి దాటేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహా దేశమంతా ఆక్సిజన్ల కొరత వెంటాడుతున్నది. వ్యాక్సిన్ల కోసం భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దేశానికే మోడల్ అన్న గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కోవిడ్ మరణాల సంఖ్య దడపుట్టిస్తున్నది. కోవిడ్ బారిన పడ్డ పేషెంట్లను సర్కారు దవాఖానాల్లో చేర్పించుకోవటంలేదు. బెడ్లు ఖాళీగా లేవంటూ వెనక్కిపంపుతున్నారు. ఓవైపు కరోనా మరణాలు పెరుగుతుంటే.. మరోవైపు పాజిటివ్ వస్తే తమ పరిస్థితి ఏంటనే భయం ప్రతి భారతీయుడినీ వెంటాడుతున్నది. అయినా మోడీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలంతా పశ్చిమబెంగాల్ ఎన్నికలవైపే దృష్టిపెడుతున్నది.
దృశ్యం..1
30 ఏండ్ల యువతి.. ఆస్పత్రి లో డాక్టర్ డాక్టర్ అంటూ అరు పులు.. ఆమె తండ్రి ఆస్పత్రి స్ట్రెచర్‌పై బయట ఉన్నాడు. ఎవరూ వైద్యం అందించటానికి ముందుకు రాలేదు. ప్లీజ్ డాక్టర్ అంటూ అరుస్తున్న ఆమె అరుపులు ఎవరికి వినపడలేదు. ఆమె తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నా ఓటు అవసరమైనపుడు నేతలు మా దగ్గరికి పరిగెత్తుకొస్తారు... నా తండ్రి ఆస్పత్రి గేటు వద్ద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. ఎవరైనా వచ్చి కాపాడారా.. అంటూ బిగ్గరగా రోదించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన విషాదఘటన ఇది.
దృశ్యం.2
సకాలంలో వైద్యం అందక ఆర్మీలో పనిచేసే జవాన్ చనిపోయాడు. గేటు వద్ద కూలబడి అతని భార్య, తనయుడు కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తున్నారు. ఆ రోదన అరణ్యరోదనగా మారింది. తన భర్త ప్రాణాలు కాపాడటానికి ఆక్సిజన్ అవసరమైంది. బిడ్డతో కలిసి ఆ మహిళా విలపిస్తున్నా పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది... చనిపోయాక ఆ జవాన్ మృతదేహాన్ని స్ట్రెచర్‌పై వేసుకుని మార్చురీ రూమ్‌కు తరలించారు.
'కరోనా పాజిటివ్ వస్తే.. నాన్నను ఆస్పత్రికి తీసుకొచ్చాం. ముందు అడ్మిట్ చేసుకోండి... ఆ తర్వాత ఏమైనా ఉంటే చూసుకుందాం.. మా నాన్న ప్రాణాలు కాపాడాలంటూ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నాం. 40 డిగ్రీలకుపైగా ఎండలో నాన్నను అలాగే వదిలేశారు. కనీసంలోనికి కూడా అనుమతించలేదు. రాత్రే ఆస్పత్రికి తెస్తే..ఇక్కడ ఖాళీల్లేవ్. ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అక్కడా చేర్చుచుకోలేదు. తిరిగితిరిగి ఇక్కడకు వస్తే..చనిపోయాక కానీ కనికరించలేదు. దేశం కోసం ప్రాణాలు త్యగించటానికి ముందుండే జవానుకు వైద్యం అందించలేరా.!' జవాన్ కుమారుడి ఆవేదన ఇది.
దృశ్యం..3
గుజరాత్ ప్రొఫెసర్ ఇంద్రాణి బెనర్జీ.. డీన్ ఆఫ్ న్యూరోసైన్సెన్స్. ఆమె ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండగా.. ఒక ఆస్పత్రినుంచి ఇంకో ఆస్పత్రికి పంపుతూనే ఉన్నారు. బెడ్లు ఖాళీగా లేవంటూ తిప్పుతూనే ఉన్నారు. అహ్మదాబాద్‌లోని కోవిడ్ ఆస్పత్రికి వెళ్తే.. అంబులెన్స్‌లో రాలేదనీ.. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు. పల్స్రేట్ పడిపోతూ ఇంద్రాణి కన్నుమూసింది.
దృశ్యం..4
యూపీలో సీఎంకు పాజిటివ్ వచ్చింది. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో అక్కడి బీజేపీ నేత సునీల్‌బన్సల్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన యోగికి, అతని సిబ్బందికి బన్సల్ నుంచి కోవిడ్ సోకింది. బీజేపీ నేతలు సామాజిక దూరం పాటించమంటారు. మాస్కులు ధరించాలంటారు. మాస్కులు ధరించకుండానే ఇస్లాంపూర్‌లో అమిత్‌షా ర్యాలీలు నిర్వహించారు. సెకండ్‌వెవ్ వచ్చాక రెండులక్షలకు పైగా కేసులు వెయ్యికి పైగా రోజువారీ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా షురూ అయి ఏడాది అయినా ఎలాంటి నియంత్రణా చర్యలు తీసుకోలేదు. కుంభమేళాలో లక్షలకుపైగా హాజరయ్యారు. భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ మాత్రం.. గంగాలో మునిగితే కరోనా రాదంటూ చేస్తున్న అశాస్త్రీయ వ్యాఖ్యలను వైద్యవర్గాలు తప్పుపడుతున్నాయి. కరోనా రోగి దగ్గినా.. తుమ్మినా.. కోవిడ్ సంక్రమించే అవకాశాలున్నాయని చెబుతున్నా... గో మూత్రం, గంగలో మునగటం వంటి మూఢ విశ్వాసాల వాదనలు చేస్తున్నారు.
గుజరాత్ దేశానికే మోడల్ అంటూ ప్రచారం చేస్తున్న ప్రధాని సొంత రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారా యి. అక్కడ వైద్య ఆరోగ్యవ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్న మైందన టానికి ఎన్నో సాక్ష్యాలు.. మరెన్నో ఆధారాలు. ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రెమిడెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్‌లో అమ్ముతున్నారని ఓ జర్నలిస్ట్ కార్తీక్అగ్నిహౌత్రి స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. రూ.5400 విలువ కలిగిన రెమిడెసివిర్ ఇంజెక్షన్ 18వేలకు విక్రయిస్తున్నట్టు తేలింది.
ఇలా దేశంయావత్తూ కరోనా విలయంతో కొట్టుమిట్టాడుతుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం మాటలకే పరిమితమవుతున్నారు. కరోనా కన్నా... పశ్చిమబెంగాల్ ఎన్నికలపైనే శ్రద్ధపెడుతున్నారు. అక్కడ మిగిలిన విడతపైనే గురిపెడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.