Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య ను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతోందని, వాస్తవ పరి స్థితిని దాస్తోందని ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌పై వెలువడుతున్న అధికారిక సమాచారంపై న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్స్‌లలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో, వైరస్ బాధితులు ఎంతమందో ..ఇవన్నీ దాస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతూ చీఫ్ జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ భార్గవ్ కారియాలతో ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై వరుసగా రెండు రోజులు విచారణ జరిగింది.
ఫిబ్రవరి, 2020లో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని పాటించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చీఫ్ జస్టిస్ విక్రం నాథ్ అన్నారు. ఆ రోజు న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల్ని పాటించి వుంటే, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రతిరోజూ కేసుల సంఖ్య సునామీలా వచ్చిపడుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కమలా త్రివేదీ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందని, వైరస్ బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు రెమిడెసివర్ ఇంజక్షన్లు పెద్ద ఎత్తున వాడారని, అది ఇప్పుడు కొరత ఏర్పడిందని, వైరస్ బాధితులు పెరగడానికి ఇది ముఖ్య కారణమని అన్నారు. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. విచక్షణారహితంగా వైద్యులు రెమిడెసివర్ ఇంజక్షన్లు ఇచ్చారని చెప్పేందుకు మీ దగ్గరేమైనా గణాంకాలున్నాయా? అని ప్రశ్నించింది. ఒక పారాసిటమల్ బిల్లను ఇచ్చినట్టు రెమిడెసివర్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? అలా కానే కాదు..అని చీఫ్ జస్టిస్ అన్నారు.
పాజిటివ్ కేసుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు? చికిత్స అవసరమయ్యే వారి బాధితుల వివరాలు ఎందుకు దాస్తున్నారు? ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని చీఫ్ జస్టిస్ అన్నారు. ఎక్కడికి వెళ్లినా బెడ్లు ఖాళీగా లేవని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 53శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఎలా చెప్పగలుతుంది? అని ఆయన ప్రశ్నించారు. రెమిడెసివర్ ఔషధం, పరీక్షా కేంద్రాలు, హాస్పిటల్స్ బెడ్లు, కరోనా పేషంట్లకు అందుతున్న చికిత్స..తదితర అంశాలతో పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
మందుల్లేవ్ : అహ్మదాబాద్ మెడికల్ అసోసియేషన్
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన సమాచారం ప్రకారం, 8,152 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన గరిష్ట కేసులు ఇవే. గత 24 గంటల్లో వైరస్ కారణంగా 81 మంది చనిపోయారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, అహ్మదాబాద్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సీఎం విజరు రూపానీకి లేఖ రాసింది. హాస్పిటల్స్‌లో తప్ప మరోక చోట ఆక్సీజన్ వాడకంపై నిషేధం ప్రకటించాలని ఆ లేఖలో సీఎంకు సూచించారు. అలాగే కరోనా పేషంట్లకు వైద్య సేవలు అందించడానికి సరైన మందులు, ఔషధాలు అందుబాటులో లేవని తెలిపారు.