Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలమైన ఆధారాలు ఉన్నాయన్న లాన్సెట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ గాలిద్వారానే వ్యాపిస్తోందన డానికి బలమైన ఆధారాలు ఉన్నట్టు తాజాగా మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. మొదటి నుంచీ దీనిని గాలి ద్వారా వ్యాపించే వైరస్‌గా చూడకపోవడం, అందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడినట్టు స్పష్టం చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడాలకు చెందిన ఆరుగురు నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించి వచ్చిన ఫలితాలను లాన్సెట్‌లో ప్రచురించారు. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ ప్రొఫెసర్ లూయిస్ జిమెనెజ్ కూడా ఒకరు. ఇన్నాళ్లూ పెద్ద పెద్ద తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందనడానికి దాదాపుగా ఎలాంటి ఆధారాలూ లేనట్టు జిమెనెజ్ చెప్పడం గమనార్హం. ఈ ఆరుగురు నిపుణుల ప్రకారం సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లలో వచ్చే భారీ సంఖ్యలో కేసులు కేవలం సన్నిహితంగా ఉండటం, తాకడం, వైరస్ బాధితులు తాకిన ఉపరితలాలను తాకడం వంటి వాటి వల్ల మాత్రమే రావు. ఇన్ఫెక్షన్ సంక్రమణ రేటు బయటి కంటే నాలుగు గోడల మధ్యే ఎక్కువ. ఒకవేళ లోపల వెంటిలేషన్ బాగా ఉంటే సంక్రమణను అడ్డుకోవచ్చనీ తేలింది. అంతేకాదు వైరస్ నిశ్శబ్ద సంక్రమణం (లక్షణాలు లేకుండా, తుమ్మడం, దగ్గడంలాంటి చేయకుండా) 40 శాతం ఉన్నట్టు కూడా వీళ్లు తేల్చారు. అసలు ప్రపంచంలో ఇన్ని కేసులు రావడానికి ప్రధాన కారణం ఈ నిశ్శబ్ద సంక్రమణమే అన్నది ఈ నిపుణుల వాదన. ఇక హౌటళ్లలో వేర్వేరు రూమ్‌లలో ఉంటూ, ఒకరికొకరు ఎదురు పడిన సందర్భాలు లేకపోయినా వైరస్ సోకిన సందర్భాలు కూడా ఉన్నట్టు వీళ్ల అధ్యయనంలో తేలింది. ఈ వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.