Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క రోజే 2.17 లక్షల కేసులు
- మూడు రాష్ట్రాల్లోనే లక్ష కేసులు
- 16 రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల
- ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోడీ భేటీ
- కర్నాటక సీఎం యడియూరప్పకు రెండోసారి పాజిటివ్
- అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కరోనా వైరస్ రెండో దశ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గతం (మొదటి దశ)లో ఎన్నడూ లేనంతగా రెండో దశలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2.17 లక్షల కరోనా కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. కుంభమేళా, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కరోనా హాట్స్పాట్లుగా
మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతు న్నారు. మరోవైపు వ్యాక్సిన్ల కొరత దేశాన్ని పీడిస్తోంది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ డోస్‌లు పంపాలని ప్రధాని మోడీకి లేఖలు రాశాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,17,353 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులోనే 1,185 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 1,42,91,917 కరోనా కేసులు నమోదు కాగా, 1,74,308 మంది మృతి చెందారని పేర్కొంది.
ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 1,25,47,866 మంది కోలుకు న్నారని, ప్రస్తుతం దేశంలో 15,69,743 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 11,72,23, 509 వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్టు పేర్కొంది. రోజువారీ మొత్తం కేసుల్లో సగం, కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోద వుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 61,695, ఉత్తరప్రదేశ్‌లో 22,339, ఢిల్లీలో 16,699 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజు వారి కేసుల్లో 80 శాతం 10రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరో గ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు 16 రాష్ట్రాల్లో కేసులు పైపైకి ఎగబాకుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజ రాత్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మొత్తం కరోనా మరణాల్లో 85.5శాతం 10రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి.
ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోడీ భేటీ
దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఉక్కు, రవాణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ప్రధాని సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా చికిత్స కోసం వినియోగించే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోడీ అన్నారు. ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లపై నిరంతర నిఘాను ఉంచాలని అన్నారు. 24 గంటల పాటు ఆక్సిజన్ ట్యాంకర్లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని సూచించారు.
నేడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్ సమీక్ష
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శనివారం నాడు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాల పెంపునకు సంబంధించి దేశంలోని ఎయిమ్స్ ఆస్పత్రులతో వచ్చే సోమవారం నాడు వర్చువల్ మీట్ నిర్వహించనున్నారు. తాజా గణాంకాల ప్రకారం, దేశంలోని 54 జిల్లాల నుంచి గత ఏడు రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని, అలాగే 44 జిల్లాల నుంచి గత 28 రోజులుగా ఎలాంటి కరోనా కేసులు నమోదవలేదని కేంద్ర మంత్రి హర్షవర్థన్ మీడియాకు తెలిపారు. రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారంనాడు ఎయిమ్స్ ఆసుపత్రిని హర్షవర్ధన్ సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఇతర డాక్టర్లు ఆయన వెంట ఉన్నారు.
కర్నాటక సీఎం యడియూరప్పకి రెండోసారి కరోనా
కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం ఉదయం ఆయనను రామయ్య మెమోరియిల్ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం ఆయనను మణిపాల్ ఆస్పత్రికి మార్చారు. దీనికి ముందు శుక్రవారం ఉదయం యడియూరప్ప తన నివాసంలో కరోనాపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించారు. యడియూరప్పకు కరోనా సోకడం ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఆగస్టు 2న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శిరోమణి అకాలీదళ్ ఎంపి, మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ కరోనా బారిన పడ్డారు. సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు.
అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి : సుప్రీం కోర్టులో పిల్
18 ఏండ్లు నిండిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగినందున ఇది అత్యవసరమని న్యాయవాది రష్మీ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రెండు డోసులకు మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో 18 ఏండ్ల వారికి వ్యాక్సిన్ అందే సమయానికి కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగేందుకు అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏండ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వకుండా తిరస్కరించడం నిరంకుశ, వివక్షపూరితమని పిటిషనర్ పేర్కొన్నారు. భారత్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే రోజుకు 10 మిలియన్ల డోసులు వేయాలని నిపుణులు చెప్పినట్టు పిటిషన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జవదేకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.