Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రసాదం'లా కరోనా వైరస్ పంపిణీ : ముంబయి మేయర్ వ్యాఖ్య
హరిద్వార్ : కుంభ మేళాపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తటంతో ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధాని విజ్ఞాపన మేరకు కుంభ మేళాను శనివారంతో ముగించినట్టు జునా అఖాడాకు చెందిన స్వామి అవధేశానంద గిరి ప్రకటించారు. కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు. హరిద్వార్‌లోని కుంభమేళాలో పాల్గొన్న పలువురు అఖండాలకు, సాధువులకు కరోనా సోకడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైన సంగతి విదితమే. కుంభ మేళా సందర్భంగా దేవతలందరికీ శనివారం ఉద్వాసన పూజలు నిర్వహించినట్టు తెలిపారు. స్వామి అవధేశానంద గిరి ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు సమ్మతించాలని ఇతర సాధు, సంతులను కోరారు. మిగిలిన రెండు పవిత్ర స్నానాల్లోనూ నామమాత్రంగా సాధువులు మాత్రమే పాల్గొనాలని కోరారు.
జనం లేకుండా జరపాలి.. : ప్రధాని
ఇప్పటికే కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో చాలామందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే జనం లేకుండా జరపాలని ప్రధాని మోడీ సాధువుల్ని కోరారు. ఇదే విషయాన్ని శనివారం మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏప్రిల్ 1న మొదలైన కుంభమేళా ఈ నెల 30 వరకూ జరగాల్సి ఉన్నది.
'కరోనా వాహకాలుగా మారుతున్నారు'
హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన యాత్రికులు తమ సొంత రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను ప్రసాదంలా పంపిణీ చేస్తున్నారని ముంబయి మేయర్, శివసేన నేత కిషోరి పెడ్నేకర్ శనివారం వ్యాఖ్యానించారు. కుంభమేళా నిర్వహించడంవల్లే ఇప్పుడు అక్కడ కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్నదని ముంబై మేయర్ ఆరోపించారు. కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వెళ్లారని, ఇప్పుడు వారంతా తమతమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లి కరోనా వైరస్‌ను ప్రసాదంలా పంచిపెడుతారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కరోనా వాహకాలుగా మారుతున్నారని ఆమె అన్నారు. ముంబయికి తిరిగి వచ్చిన యాత్రికలను క్వారంటైన్‌కు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నామనీ, వారి క్వారంటైన్ ఖర్చులను వారే భరించాల్సి వుంటుందని అన్నారు. ముంబయిలో 95 శాతం మంది కరోనా నిబంధనలను పాటిస్తున్నారనీ, మిగిలిన వారు నిబంధనలు పాటించకుండా సమస్యలు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. ముంబయిలో కరోనా పరిస్థితి దృష్ట్యా పూర్తి లాక్డౌన్ విధించాలని తాను భావిస్తున్నానని పడ్నేకర్ అన్నారు.