Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన కేరళ ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా విజృంభణ మరోవైపు టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల కొరతపై కేంద్రానికి లేఖ రాశాయి. పలు చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం నిలిచిపోయింది. టీకాలు లేక పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ సీఎం పినరయి విజయన్.. రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు నిండుకున్నాయనీ, తమ రాష్ట్రానికి మరో 50 లక్షల డోసులు కావాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్కు లేఖ రాశారు.
అయితే, కేరళకు ఇంకా కరోనా డోసులు అందలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె.శైలజ స్పందిస్తూ.. కరోనా కట్టడిలో భాగంగా కేరళ ప్రభుత్వం బలమైన రక్షణ చర్యలు, మెరుగైన కరోనా కట్టడి చర్యలు తీసుకుంటుంన్నదని అన్నారు. అలాగే, భారీ స్థాయిలో పరీక్షలు, టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన 60.54 లక్షల కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదుల్లో కేవలం 5.5 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయని శైలజ తెలిపారు. కేరళకు అత్యవసరంగా 50 లక్షల డోసులను పంపాలని కేంద్రాన్ని కోరినట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, ఆక్సిజన్ కొరత లేనప్పటికీ.. కేసులు మరింతగా పెరిగితే దాని సరఫరాను పెంచాల్సిన అవసరాన్ని కేంద్రానికి తెలియజేశారు.