Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్ మార్కెట్ దందాతో దొరకని మందు
- కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరం
- రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. రోగుల బంధువుల ఆగ్రహం
గాంధీనగర్ : కరోనా రోగులకు ఇచ్చే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కొరత గుజరాత్లో ఏర్పడింది. అక్కడ బ్లాక్‌మార్కెట్ దందాతో ఆ ఇంజెక్షన్ లభించడమే గగనమైంది. ముఖ్యంగా, కొన్ని రోజుల నుంచి గుజరాత్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కోసం రోగుల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం తీవ్ర అలసత్వం వహిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తీరును గుజరాత్ హైకోర్టు తప్పుబట్టింది.
రెమ్డిసివిర్ డ్రగ్ కొరతపై సుమోటుగా రాష్ట్ర హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఈనెల 15న విచారణకు స్వీకరించింది. అయితే, ఈ డ్రగ్‌ను వైద్యులు తమ ప్రిస్క్రిప్షన్లలో అధికంగా సూచించడం కారణంగానే ఈ కొరత ఏర్పడిందని అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది వాదించారు. అయితే, వైద్యులు ఈ విధంగా చేస్తున్నారనడానికి సమాచారం ఏది? వైద్యులే దీనంతటికి కారణమన్నది మీ వాదనా? '' అని ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్, న్యాయమూర్తి భార్గవ్ ఖరియాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కోవిడ్-19కి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని రాష్ట్రం అందించడం కూడా డ్రగ్ కొరతకు కారణం అయ్యుండొచ్చని న్యాయస్థానం తెలిపింది.
మార్చి చివరి వారం నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. అయితే, రెమ్డిసివిర్ మందు లభ్యం కాకపోవడంతో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా మారింది. గుజరాత్ ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ యంత్రాంగం (ఎఫ్‌డీసీఏ) సమాచారం ప్రకారం.. ఈనెల 7న 72,507 ఇంజెక్షన్ యాంపుల్స్, 8న 41,500, 9న 24,687 ఇంజెక్షన్ యాంపుల్స్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసింది. ఇది ప్రయివేటు డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందార్లు బయట జరిపిన అమ్మకాలకు అదనం. అయితే, ఆరోగ్య శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈనెల 7న 3,575 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 8న 4021 కేసులు, 9న 4,541 కేసులు రికార్డయ్యాయి. అయితే, ఇంజెక్షన్ యాంపుల్స్.. ఆయా రోజల్లో దాఖలైన కొత్త కేసుల కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ రెమ్డిసివిర్ కొరత ఏర్పడటం పలు అనుమానాలకు తావిస్తున్నది. రెమ్డిసివిర్ పక్కదారి పట్టడం కానీ లేదా ప్రభుత్వమే తప్పుడు సమాచారం ద్వారా కరోనా కేసులను తక్కువ చేసి చూపించి ఉండటం కానీ జరిగి ఉండాలని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. సెకండ్‌వేవ్ ఉధృతి కొనసాగుతున్న ఈ తరుణంలో రోగులు, వారికి మందులు అందించే విషయంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఆఫీసులో రెమ్‌డెసివిర్ ఉచిత పంపిణీ..!
ఒక పక్క రెమ్‌డెసివిర్ మందు లభ్యతలేదని ప్రభుత్వ యంత్రాంగాలు తెలిపాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోగుల బంధువులు నానా ఇబ్బంది పడ్డారు. కానీ, సూరత్‌లోని అధికార బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మందును ఉచితంగా సరఫరా చేశారు ఆ పార్టీ నాయకులు. ఆ పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ దాదాపు ఐదు వేల యూనిట్ల రెమ్‌డెసివిర్ మందును రోగుల బంధువులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
కొరత సమయంలో బీజేపీ నాయకులకు డ్రగ్ ఎక్కడిది?
రాష్ట్రవ్యాప్తంగా మందు కొరత ఉన్నదనీ, ఈ సమయంలో బీజేపీ నాయకులకు ఇది ఎక్కడ నుంచి లభించిందని గుజరాత్‌లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ను బీజేపీ నాయకులు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించారనీ, వారిని అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు పరేశ్ ధనానీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ను వేశారు.
అయితే, తాము ఈ డ్రగ్‌ను రాష్ట్రం బయట నుంచి తీసుకొచ్చామని బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే, ఈ విషయంపై గుజరాత్ ముఖ్యమంత్రిని విలేకరులు ప్రశ్నించగా.. ' ఆ విషయాన్ని సీఆర్ పాటిల్‌నే అడగండి' అని సమాధానమివ్వడం గమనార్హం.