Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ రైల్వే కరోనా ఆంక్షలు
- మాస్కులు పెట్టుకోకపోయినా.. ఉమ్మివేసిన భారీ జరిమానా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి రంకేలేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే శాఖ కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడానికి సిద్ధమైంది. రైల్వేకు చెందిన ప్రాంతాల్లో కానీ, రైళ్లలో కానీ మాస్కు పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. రైల్వే చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు శనివారం రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్-19 నిబంధనలను అనుసరించి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ రైల్వే శాఖ వెల్లడించింది.
ఆ ఉత్తర్వుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే రైల్వే ప్రాంగణంలోకి అడుగు పెట్టాలని రైల్వేశాఖ పేర్కొంది. అంతేకాదు, రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేసే వారికి కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. రైల్వే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. అపరిశుభ్రత వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయనీ, ప్రజారోగ్యం దెబ్బ తింటుందని తెలిపింది. తాజాగా తాము తీసుకున్న ఈ కరోనా నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయనీ, 6 నెలల వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.