Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ తయారీకి సహకరిస్తామని..అడ్డుకుంటున్నారు..
- ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం ఎత్తేయాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీకి సహకరిస్తామని ప్రకటించిన అమెరికా, మరోవైపు ముడిసరుకుల ఎగుమతిపై నిషేధం విధించిందని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించింది. వ్యాక్సిన్ ముడిపదార్థాల ఎగుమతిపై నిషేదం విధించటం వల్ల భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీకి అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో హాస్పిటల్స్లన్నీ రోగులతో నిండిపోయింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో కీలకంగా ఉన్న వ్యాక్సిన్ సరఫరాకు అడ్డంకులు ఏర్పడటంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.
మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్..నాలుగు దేశాల కూటమి సదస్సు మార్చి 12న జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో...సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారీకి సహకరిస్తామని అమెరికా వాగ్దానం చేసింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యాక్సిన్ తయారీ హబ్‌గా భారత్ నిలబడుతుందని, ఆ దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్థికంగా సాయం చేస్తామని కూడా అమెరికా ప్రకటించింది.
ఆ ప్రకటనకు విరుద్ధంగా వ్యాక్సిన్ తయారీ ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం ప్రకటించింది. దీనిని వెంటనే ఎత్తేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. భారత్‌కు ఇచ్చిన వాగ్దానానికి అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరింది. వ్యాక్సిన్ కొరత వల్ల కోవిడ్ వైరస్ వ్యాప్తి భారత్‌లో అనూహ్యంగా పెరిగిందని తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, గత 38 రోజులు వరుసగా కరోనా కేసుల సంఖ్య పెరగటంపై పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.