Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారుపై సోనియా గాంధీ తీవ్ర విమర్శలు
- 25 ఏండ్లు దాటినవారికి టీకా.. పేదలకు రూ.6వేల సాయం అందించాలని డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడం, దానిని ఎదుర్కొవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో పలు రాష్ట్రాలపై ప్రధాని మోడీ సర్కారు వివక్షను చూపిందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. శనివారం వర్చువల్ పద్ధతిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా దేశంలో కరోనా ప్రభావం సహా పలు ఇతర అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ మాట్లాడుతూ.. కరోనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంపై విమర్శలు గప్పిస్తూనే.. పలు సూచనలు సైతం చేశారు.
''దేశంలో కోవిడ్-19 వెలుగుచూసినప్పటి నుంచి వైరస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగు ప్రభుత్వానికి అండగా నిలువడానికి ముందుకు వచ్చింది. అయితే, తమ నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి బదులు ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. కరోనాపై పోరాడే క్రమంలో సాయం అర్థించిన కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపించింది. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్య ఇస్తూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం వహించిందని'' సోనియా ఆరోపించారు.
దేశంలో పలు రాష్ట్రాలు తీవ్రంగా టీకా కొరతను ఎదుర్కొంటున్నాయనీ, ప్రస్తుత విదేశీ ఎగుమతులపై ప్రభుత్వం వెనక్కితగ్గాలన్నారు. 25 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ను అనుమతించాలని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అమల్లోకి వచ్చిన ఆంక్షలు, లాడ్డౌన్ కారణంగా పేదలు, కూలీలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అలాంటి వారందరికీ రూ.6000 సాయం అందించాలని సోనియా సూచించారు. అలాగే, వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీ మాఫీ చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.