Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలితరాష్ట్రాల్లో అంతులేని కరోనా మరణాలు
- మధ్యప్రదేశ్‌లో ఒక్కరోజే 40కిపైగా కోవిడ్ పేషెంట్లకు అంత్యక్రియలు
- డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు గాలికొదిలిన మోడీసర్కార్
- సెకెండ్‌వేవ్ పడగవిప్పుతున్నా.. ఇప్పటికీ కేంద్ర క్యాబినెట్ భేటీకి దూరం..
- పీఎంకేర్ ఫండ్ నిధులు ఎమయ్యాయి..?
ఇది ఏ పొలంలోనో లేదా ఊరవతల చెత్తను తగులబెడుతున్న మంట కాదు. బీజేపీ పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కాలుతున్న చితిమంటలివి. కరోనా ముప్పు తొలగలేదు.. పొంచేఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఏడాది నుంచి హెచ్చరికలు చేస్తున్నా.. మోడీ సర్కార్ గాలికొదిలేసింది. కొవ్వొత్తులు వెలిగించమన్నది. మొబైల్ ఫ్లాష్లైట్లను ఆన్ చేయాలన్నది. పళ్లాలతో చప్పుడు చేయమన్నది. గో కరోనా గో కరోనా అనమన్నది తప్ప... కరోనా ముప్పు ముంచుకొస్తే.. ఏం చేయాలో.. ఎలా అప్రమత్తంగా ఉండాలన్న ఆలోచన చేయలేదు. కోవిడ్ వైరస్ విరుచుపడుతున్నా... రెండులక్షలకుపైగా రోజువారీ కేసులు నమోదవుతున్నా ఇంతవరకూ మోడీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం అఖిలపక్ష సమావేశాన్ని పిలవలేదు. ఉధృతమవుతున్న కరోనాపై బీజేపీ పాలకుల నిర్లక్ష్య ఫలితమే ఈ చితిమంటలు. ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లోకలిసిపోతున్నాయి. గుండెలవిసేలా రోదిస్తున్న బంధువుల ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
భోపాల్ : శ్మశానవాటికలోని చిమ్నీ నుంచి పొగ బయటకు వస్తుంటే.. ఓ అమ్మాయి దీనంగా అంకుల్ నా తల్లి వెళ్లిపోతోంది. దయచేసి ఆమె చిత్రాన్ని తీయండి ప్లీజ్... ఇలాంటి హృదయ విదారక దృశ్యాలెన్నో మధ్యప్రదేశ్ మొదలుకుని బీజేపీ పాలిత, భాగస్వామ్య రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన భద్భుదా విశ్వం ఘాట్ అది. ఇక్కడ ఒక్కరోజే (శుక్రవారం)40 మంది కోవిడ్ వైరస్ బారిన పడిన పేషెంట్లు తుదిశ్వాస విడిచారు. చితిమంటల్లో కాలి బూడిదయ్యారు.
భోపాల్‌లో ఐదువేలకుపైగా కేసులు నమోదవుతుంటే.. రోజుకు వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అధికారలెక్కలు చూపుతున్నాయి. వాస్తవానికి 200లకు పైగా కోవిడ్ పేషెంట్లు చనిపోతున్నారనటానికి తాజాగా శ్మశానవాటికల్లో కనిపిస్తున్న చితిమంటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇక ఒక్కరోజే కోవిడ్ పేషెంట్ల 50 మందికిపైగా మృతిచెందితే.. దహనసంస్కారాల కోసం.. అక్కడి కాటికాపరులు పగలనక, రాత్రనక పనిచేయక తప్పటంలేదు.
గతంలో ఒకటి నుంచి ఐదుదాకా శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే.. కరోనా సెకండ్‌వేవ్ వచ్చాక రోజూ 50 శవాలను తీసుకువస్తున్నారు. వచ్చిన బంధువులు మా వారికి ముందుగా దహనసంస్కారాలు చేయాలని వత్తిడి చేస్తుండటంతో.. కాటికాపారులకు ఏం చేయాలి.. వారిని ఎలా సముదాయించాలో తెలియక అవస్థలుపడుతున్నారు.
భద్భుదా విశ్వం ఘాట్‌లో విద్యుత్ శ్మశానవాటిక వద్ద ఎటు చూసినా ఎన్నో హృదయ విదారక దృశ్యాలే. ఫోటో జర్నలిస్ట్ సంజీవ్ ఫోటోలు తీస్తుంటే.. అక్కడ 10, 12 ఏండ్ల వయస్సు ఉన్న మైనర్లు ఉన్నారు. అంతలో అంకుల్ నా తల్లి వెళ్తోంది, దయచేసి ఆమె చిత్రాన్ని తీయండి. ఆ క్షణంలో నోటి నుంచి మాటాలు రాలేదన్నారు. రాత్రంతా ఆ అమ్మాయి గొంతు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. నేను రాత్రంతా నిద్రపోలేదు. ఇంతటి ఘోరాలు జరుగుతున్నా పాలకులు మేల్కొనరా అన్న ప్రశ్న ఉదయించింది.
''ఇది ఎవరి తప్పు.. అని వారికి తెలియదు, కాని పరిపాలన, బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే కరోనా రోగులకు కావాల్సిన బెడ్లు, ఆక్సిజన్ లేదా ఇంజెక్షన్లు, అవసరమైన మందులు లేవు'' అక్కడ అందుబాటులోలేకపోవటం వల్లే ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
డేటా దాస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్
మొట్టమొదటి కరోనాసోకిన వారి డేటాను మధ్యప్రదేశ్ సర్కార్ తొక్కిపెట్టిందనే వాదనలు ఉన్నాయి. ఇపుడు మరణాలకు సంబంధించిన గణాంకాలను దాచిపెడుతున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. కుటుంబసభ్యులు రోగుల్లా మారుతూ.. అటు ఇటు తిరుగుతూనే ఉన్నా శివరాజ్ సర్కార్ కనికరం చూపటంలేదు. చివరికి శ్మశానవాటికల్లో ఎవరి మృతదేహం ఎక్కడ ఉన్నదో కూడా తెలియనంతగా గందరగోళపరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ ఆస్పత్రుల్లో, శ్మశానవాటికల్లోనూ సరైన ఏర్పాట్లులేవనే దృశ్యాలు కండ్లకుకట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాలు 21 మరణాలను నమోదు చేయగా, కేవలం అయిదు రోజుల్లో 356 మంది కరోనా రోగులకు దహన సంస్కారాలు జరిగాయి
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు.. మరణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ భయానకవాతావరణం సృష్టిస్తున్నది. రోజుకూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నా.. మరణాల సంఖ్యా వెయ్యి దాటిపోతున్నది. కానీ మోడీ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ గురించి ఏమాత్రం శ్రద్ధచూపటంలేదు. ప్రకృతివైపరీత్యాలకన్నా అతి ఘోరంగా దేశప్రజలపై కరోనా దాడి చేస్తుంటే.. కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
తాను సర్వసంగపరిత్యాగినంటూ చెప్పుకునే మోడీ... పీఎంకేర్స్ కింద వసూలుచేసిన కోట్లఖజానా ఎందుకని ఖర్చుపెట్టరు..? కరోనాతో జనం అంతా చనిపోయి వల్లకాడుగా మారాక ఆ నిధులు ఏం చేసుకుంటారని చితిమంటల్లో కాలిబూడిదైన రోగుల బంధువులు ఆగ్రహావేశాలను వెళ్లగక్కుతున్నారు. ఇంత జరుగుతున్నా... మోడీ అమిత్‌షాలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. వారిద్దరూ మాస్కులు ధరించటంలేదు. హాజరైన జనంకూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం గమనార్హం.
ఎన్నడూ చూడలే...- ఫోటో జర్నలిస్ట్ సంజీవ్
నేను 1984 భోపాల్ గ్యాస్ విషాదం సమయంలో ఫోటోలు తీశా. కాని ఈ రోజు వరకు నేను ఇంత భయంకరమైన దృశ్యాన్ని చూడలేదు. ఒకేసారి 45 మృతదేహాలకు చితిపెడుతుంటే.. ఆశ్చర్యానికి గురయ్యా. అందుకే డ్రోన్, స్టిల్ కెమెరాలతో ఆ దృశ్యాలను బంధించా.