Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్ ముందు గుంతలు శ్రీ స్పందించని ప్రభుత్వాలు
అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీటితోపాటు విద్యుత్ వెలుగులను అందించే శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు ముంచుకొస్తోంది. ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడ్డ గుంతలకు మరమ్మతులు చేయకపోతే డ్యామ్ భద్రతకే ముప్పు వస్తుందని తెలిసినా ఏళ్ల తరబడి డ్యామ్ మరమ్మతు పనులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్లంజ్‌పూల్‌లో 6, 8 గేట్లముందు ఏర్పడ్డ గుంతలు ఇప్పుడు దాదాపు 150 అడుగుల లోతుకు పడ్డట్టు అంచనా. ఆ గుంతలు మరింత పెద్దవిగా మారి అవి డ్యామ్ వైపుగా విస్తరించే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1998లో డ్యామ్‌లోకి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అప్పుడే స్పిల్‌వే గేట్లు మొరాయించడంతో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం పూర్తిగా దెబ్బతింది. ప్లంజ్‌పూల్ దెబ్బతినడం మొదలైంది. 2002లో ప్లంజ్‌పూల్‌లో పడిన గుంతలకు తాత్కాలికంగా కాంక్రీట్ వేశారు. 2009లో రికార్డుస్థాయిలో 25.5 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో వరద ఉధృతికి డ్యామ్ దిగువన ఉండే ప్లంజ్‌పూల్ బాగా దెబ్బతిని పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. 2002లో వేసిన కాంక్రీట్కూడా కొట్టుకు పోయింది. పాత కాంక్రీట్ కొట్టుకుపోవడంతోపాటు మరింత పెద్ద గొయ్యిలు పడ్డాయి. దాదాపు 150 అడుగుల మేర గొయ్యి ఏర్పడినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. ప్లంజ్‌పూల్‌కు మరమ్మతులు చేయకపోతే డ్యామ్‌కు ముప్పు ఏర్పడుతుందని జలవనరులశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కృష్ణానదికి గరిష్టంగా 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందనే అంచనాతో దిగువకు 19.95లక్షల క్యూసెక్కులు విడుదల చేసేలా శ్రీశైలం డ్యామ్‌ను నిర్మించారు. మొదట్లో డ్యాం సామర్థ్యం 308 టిఎంసిలు కాగా, పూడిక భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు నీటి నిల్వసామర్థ్యం 215 టిఎంసిలకు పడిపోయింది. విశాఖపట్నంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి, గోవాకు చెందిన ఎన్ఐఓలతో సర్వే కూడా చేయించారు. శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు దాదాపు రూ.900 కోట్లు అవుతుందని అంచనా. శ్రీశైలం డ్యాం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు అయినందున రెండు రాష్ట్రాలు ఖర్చు లను భరించాలని, ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా సహకరించాలని గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. అయినా, కేంద్రం స్పందిం చలేదు. ఇరు రాష్ట్రాలు చర్యలేమీ తీసుకోలేదు. డ్యామ్‌పై ఒత్తిడి తగ్గింపే సమస్యకు పరి ష్కారమని నిపుణులు చెబుతున్నారు. శ్రీశైలం ఎగువన సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం, తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్లను చేపడితే శ్రీశైలం డ్యామ్‌పై ఒత్తిడి తగ్గించుకునే అవకాశం ఉంది.