Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేని పక్షంలో మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వండి
- మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు
అమరావతి : కరోనా నియంత్రణ చర్యలో భాగంగా మున్సిపల్ సిబ్బంది అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని తీరాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యాక్సిన్ వేయించుకోవడానికి నిరాకరించే వారు దానికి తగ్గ కారణాలు వివరించడంతో పాటు, మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించాలన్నది ఈ ఆదేశాల సారాంశం. ప్రభుత్వం నుండి అందిన ఉత్తర్వులను పేర్కొంటూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరికొన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో సిబ్బందికి ఆదివారం రాత్రి ఆదేశాలు అందాయి. వ్యాక్సిన్ వేసుకోని వారు సోమవారం సాయంత్రం 5 గంటల లోపు (19వ తేది) మెడికల్ సర్టిఫికేట్లు సంబంధిత సచివాలయ అడ్మిన్ సెక్రటరీకి అందజేయాలని ఈ ఆదేశాలలో పేర్కొన్నారు. ఇలా సమర్పించిన ధృవీకరణ పత్రాలను, వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాల పట్టికను సాయంత్రం ఆరు గంటలలోపు అడ్మిన్ సెక్రటరీ పై అధికారులకు అందచేయాలని, ఈ ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత అక్కడక్కడ కొందరు మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పలువురు ఆరోగ్య సిబ్బంది. మున్సిపల్, అంగన్వాడీ, సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఇప్పుడు వీరందరికి వయోపరిమితితో నిమిత్తం లేకుండా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. భయాందోళనలు తొలగించి వ్యాక్సిన్ వేసుకునేలా ఒప్పించడానికి బదులుగా ఇలా ఒత్తిడి చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి జీతాలు నిలిపివేయడానికి గత నెలలో అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయని, దీనిపై గట్టిగా ప్రశ్నించడంతో వెనక్కి తగ్గారని, ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వారు అంటున్నారు.