Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో ప్రమాదకరస్థాయిలో కరోనా విజృంభణ
- పడకల కొరతపై ప్రధానికి కేజ్రీవాల్ లేఖ
అహ్మదాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రెట్టింపు వేగంతో వైరస్ వ్యాపిస్తుండటంతో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. చాలా చోట్ల పడకలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోబెడ్పై ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి తోడు ఆక్సిజన్ కొరత కూడా రోగుల ప్రాణాలను హరిస్తోంది. ప్రధాని స్వరాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్లో కరోనా విజృంభణతో అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. పడకలు అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల కరోనా రోగుల తమ వంతు కోసం అంబులెన్స్‌లలో ఆస్పత్రుల ముందు ప్రాణాలతో పోరాడుతూ ఎదురుచూస్తున్నారు. వీరిలో పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యేలోపు చికిత్స ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి సాక్షంగా రాజ్‌కోట్‌లోని సివిల్ ఆస్పత్రి ముందు గత కొన్ని రోజులుగా కరోనా రోగులున్న అంబులెన్స్‌లు భారీ సంఖ్యలో క్యూ కట్టడం నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే, అహ్మదాబాద్ సహా పలు నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఇదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రలో కరోనా లెక్కలపై, కట్టడి చర్యలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క గుజరాత్‌లోనే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు పెరగడం.. మరోవైపు వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ
దేశరాజధానిలో ఢిల్లీలో కరోనా ఉప్పెన ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదుకావడంతో అక్కడి ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. బెడ్ల కొతర తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం సహాయం కోరారు. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ రాజధానిలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందనీ, బీజేపీ పాలనలోని మూడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఆస్పత్రుల్లో కనీసం 7 వేల పడకలు కరోనా రోగులకు కేటాయించాలని కోరారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఉన్నదని, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర హౌంమంత్రి అమిత్ షాతో కూడా వీటి గురించి మాట్లాడినట్టు పేర్కొన్నారు.