Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజ్రీవాల్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితుల చికిత్స కోసం పడకల కొరత వేధిస్తున్న తరుణంలో రైల్వే శాఖ సాయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఆమాద్మీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. శాకుర్ బస్తీ, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో 5,000 పడకలతో కొవిడ్ బోగీలను ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ సాయాన్ని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. కొవిడ్ బోగీల ద్వారా 5,000 పడకలను శాకర్ బస్తీ, ఆనంద్ విహార్ స్టేషన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మకు ఢిల్లీ సర్కారు ప్రధాన కార్యదర్శి విజరు కుమార్ దేవ్ లేఖ రాశారు. అంతకుముందు... దేశ రాజధానిలో కరోనా ఉద్ధతితో పరిస్థితి క్షణక్షణానికి తీవ్రరూపు దాలుస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా కలిపి వంద ఐసీయూ పడకలు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. 24గంటల వ్యవధిలో కరోనా పాజిటివ్ రేటు 24 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై తాను కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్టు చెప్పారు.
కొవిడ్ బోగీలను వినియోగించుకోండి :కేంద్ర రైల్వే శాఖ
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ వద్ద ఉన్న కొవిడ్ బోగీలను వినియోగించుకోవాలని అన్ని రాష్ట్రాలను రైల్వే శాఖ సూచించింది. ఇప్పటికే తమ వద్ద 4,000 కొవిడ్ బోగీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాలు కోరిన ఆయా చోట్ల వీటిని నిలుపుతామని చెప్పింది. దేశంలో కరోనా ఉద్ధతి కొనసాగుతోందని, వైరస్ బాధితులుగా మారే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం దేశవ్యాప్తంగా 220 ప్రదేశాల్లో ఈ కోచ్‌లను ఏర్పాటు చేసి పెట్టామని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ మీడియాకి వెల్లడించారు. గతేడాది కరోనా మొదటి దశ వ్యాప్తి సమయంలో... కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు కొవిడ్ బోగీలను రైల్వే శాఖ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.