Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 శాతం తగ్గిన ఓటింగ్ శ్రీ భారీ మెజార్టీ సాధ్యమేనా?
నెల్లూరు : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓట్లు, మెజార్టీలపై అంచనాలు వేస్తున్నాయి. ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని ముందునుంచీ ప్రచారం జరిగింది. అయితే, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆశపడుతున్నట్లు నాలుగు నుంచి ఐదు లక్షల మెజార్టీ సాధ్యమేనా? ఇలా అనేక చర్చలు ప్రస్తుతం సాగుతున్నాయి. వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే అంత భారీ మెజార్టీ సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 64.29 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే, గతం కంటే దాదాపు 15 శాతం తక్కువ పోలింగ్ జరిగింది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల దుమారం రేగినా, అక్కడ 50.58 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. స్థానికులు ఓటింగ్‌కు రాకపోవడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజాప్రతినిధులు ఉండడంతో అధికార పార్టీదే గెలుపనే ప్రచారం తొలి నుంచి సాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీలు, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు అధికార వైసిపి సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతిని ధులుగా ఎన్నికైన వారు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిగా పని చేశారు. ఇదే సమయంలో ఉద్యోగులు, కొందరు యువకుల నుంచి పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు కనిపించాయి. తిరుపతి ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగాయి. ప్రచార సమయంలో టిడిపి ముందు కొచ్చింది. చంద్రబాబు, నారా లోకేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. పోలింగ్ నాటి పరిస్థితిని బేరీజు వేసుకొని మెజార్టీ తగ్గుతుందన్న భావనతోనే వైసిపి తిరుపతిలో అక్రమా లకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అప్పటి వైసిపి అభ్యర్థి బల్లి దుర్గాప్రసావరావుకు 7,22,877 ఓట్లు, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు వచ్చాయి. సుమారు 2,28,376 ఓట్ల మెజార్టీతో బల్లి దుర్గాప్రసాద్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. మొత్తం ఓట్లలో వైసిపికి 55 శాతం, టిడిపికి 38 శాతం ఓట్లు వచ్చాయి. గతం కన్నా ఇప్పుడు 15 శాతం పోలింగ్ తక్కువ నమోదైంది. మొత్తం ఓట్లు 10.99 లక్షలు మాత్రమే. ఈ ఓట్లతో ముఖ్యమంత్రి ఆశపడుతున్నట్లు భారీ మెజార్టీ రావడం సాధ్యం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మే రెండో తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ప్రత్యేకత చాటుకున్న సిపిఎం
రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసిన ద్రోహం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరించాలని నిర్ణయించడం తదితర అంశాలపై సిపిఎం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, బిజెపి విధానాల వల్ల ప్రభుత్వ రంగానికి ముంచుకొచ్చిన ముప్పును, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను, రాష్ట్రానికి, దేశానికి, కార్మిక వర్గానికి, రైతులకు, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఆయా తరగతుల్లోకి తీసుకెళ్లింది. బిజెపి విధానాలను సిపిఎంతోపాటు సిపిఐ, ఇతర వామపక్షాలు సైతం ఎండగట్టాయి. తద్వారా బిజెపికి ఓటు వేయాలనే వారిని పునరాలోచనలో పడేలా చేశాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్ల అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి లాలూచీ వైఖరిని సిపిఎం ప్రచారంలో పెట్టింది.