Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 23 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేశారు
- అదానీ, అంబానీల సేవలో మోడీ
- మీడియా సమావేశంలో జాతీయ రైతు సంఘాల నేతలు
విశాఖ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోన్న కేంద్రం మెడలు వంచాలంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై సమైక్య పోరా టాలు నిర్వహించాలని జాతీయ రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం కుల, మత, ప్రాంతాలకతీతంగా ప్రజలు స్టీల్‌ప్లాంట్ రక్షణకు కదిలిరావాలని కోరారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన రైతు, కార్మిక శంఖారావం సభలో పాల్గొనేందుకు వచ్చిన బికెయు జాతీయ నాయకులు రాకేష్‌సింగ్ టికాయిత్, ఎఐకెఎస్ జాతీయ నాయకులు అశోక్ధావలె, ఆలిండియా కిసాన్‌సభ జాతీయ నాయకులు బలకరణ్సింగ్, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఎపి రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోడీ నిత్యం అసత్యాలు వల్లె వేస్తూ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి చట్టబద్ధత కావాలని ఢిల్లీలో లక్షల మంది రైతులు పోరాడుతున్నారని, దేశంలో భారీ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాలకు రైతాంగం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పూర్తిగా స్థానికుల సంపదని, దానిని తాకే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కార్మికులు, రైతులు ఏకమై రక్షించుకోవాలని, దీన్ని వదిలేస్తే దేశంలో మిగతా పరిశ్రమలకూ ప్రైవేటీకరణ ప్రమాదం తప్పదని హెచ్చరించారు. కరోనా సమయంలోనూ మోడీ విధానాల వల్ల దేశంలోని 140 టాప్ కార్పొరేట్లు 596 బిలియన్ డాలర్లు సంపాదించారని వివరించారు. మోడీ దేశంలోని 23 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని, అదానీ, అంబానీల సేవలో మునిగి తేలుతున్నాడని విమర్శించారు. రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి మూడు ప్రమాదకర వ్యవసాయ చట్టాలు తెచ్చి కనీస మద్దతు ధర (ఎంఎస్పి) లేకుండా చేశారని పేర్కొన్నారు. లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దారుణమన్నారు. నేల, నింగి, నీరు అన్నింటినీ కార్పొరేట్లపరం చేయడమే పనిగా పెట్టకున్నారని విమర్శించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా దేశాన్ని దోచిందో దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం అలాగే దోచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 143 రోజులుగా రైతాంగ ఉద్యమం, 66 రోజులుగా స్టీల్‌ప్లాంట్ పోరాటం చారిత్రాత్మకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎపి రైతు సంఘాల నాయకులు మర్రాపు సూర్యనారాయణ, పి.జమలయ్య, కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్.నరసింగరావు, మంత్రి రాజశేఖర్, ఎం.ఆదినారాయణ పాల్గొన్నారు.
ఉత్సాహభరితంగా రైతు, కార్మిక ర్యాలీ
ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఎపి రైతు సంఘాల సమన్వయ కమిటీ సంయుక్తంగా చేపట్టిన రైతు, కార్మిక శంఖారావం సభ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ముందుగా వుడా పార్కు సమీపంలోని పార్క్ హోటల్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జాతీయ రైతు సంఘాల నాయకులు రాకేష్‌సింగ్ టికాయత్, అశోక్ థావలె, బలకరణ్సింగ్, బి.వెంకట్, వడ్డే శోభనాద్రీశ్వ రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుండి వేలాదిగా తరలివచ్చిన రైతులు, కార్మికులతో కలిసి ఆర్కే బీచ్ వరకు సుమారు 2 రెండు కిలో మీటర్ల మేర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, మోడీ డౌన్ డౌన్, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని తదితర నినాదాలతో బీచ్ రోడ్డు హోరెత్తింది. ప్రారంభంలో పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేసినా దానిని అధిగమించి ర్యాలీ ముందుకు సాగింది.