Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు కూడగడతామన్న
- రైతు, కార్మిక నేతలు
- ప్రధానితో చర్చల్లో ప్రస్తావిస్తాం : తికాయత్
- పోరాటంతోనే పరిరక్షణ : అశోక్ ధావలే
- వేలాదిమందితో శంఖారావ సభ, ప్రదర్శన
విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామని రైతు, కార్మిక నాయకులు ప్రకటించారు. విశాఖ ప్లాంటు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాట స్థాయికి ఉక్కు పోరాటాన్ని తీసుకువెడతామని, దేశమంతా తిరిగి మద్దతు కూడగడతామని చెప్పారు. ఈ పోరాటంలో కార్మికులతో పాటు రైతులు కూడా భాగస్వాములవుతారని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ ఆర్కె బీచ్‌లో రైతు కార్మిక శంఖారావ సభ జరిగింది. కరోనా, పోలీస్ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఈ సభకు పెద్దయెత్తున రైతులు, కార్మికులు తరలివచ్చారు. సభకు ముందు విశాఖ నగరంలో ప్రదర్శన నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పాటు, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు ఈ ప్రదర్శనలో మారుమోగాయి. రైతు, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలన్న నినాదాలు పెద్ద ఎత్తున వినిపించాయి. అనంతరం జరిగిన సభలో ఢిల్లీ రైతాంగ ఉద్యమ నేత, బీకేయూ జాతీయ నాయకులు రాకేష్‌సింగ్ తికాయత్, ఆలిండియా కిసాన్ సభ జాతీయ నాయకులు అశోక్ ధావలే, ఏసీ రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు బి.వెంకట్, కిసాన్ సభ జాతీయ నాయకులు బలకరన్సింగ్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ సిహెచ్.నర్సింగరావు తదితరులు మాట్టాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలని, లేని పక్షంలో రైతులు, కార్మికులనుండి తీవ్ర స్థాయి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాకేష్‌సింగ్ తికాయత్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు జరుగుతున్న పోరాటాలకు దేశ వ్యాప్తంగా రైతుల మద్దతు ఉంద న్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్లపై ప్రధానితో జరిపే చర్చల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. ఇన్సూరెన్స్, బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్, రైల్వే ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు రైతు, కార్మిక పోరాటాల్లో భాగస్వాములు కావాలన్నారు. అశోక్ ధావలే మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోన్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాడాలన్నారు. బలిదానాలతో సాధించు కున్న స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాల ద్వారానే కాపాడుకో గలమని తెలిపారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల న్నింటినీ అమ్మేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంద న్నారు. జాతీయోద్యమంలో ఏ పాత్రాలేని ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తూ ప్రభుత్వ రంగాల్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతోందని విమర్శించారు.