Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఒక్కరోజే 2.61లక్షల కేసులు, 1501 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా వైరస్ రెట్టింపు వేగంతో వ్యాపించడంతో పాటు పాజిటివిటీ రేటు సైతం అత్యంత వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు వారాల్లోనే పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగింది. కేవలం 12 రోజుల్లోనే 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటివిటి రేటు సైతం 3.05 శాతం నుంచి 13.54 శాతానికి పెరిగింది. అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో వీక్లీ పాజిటివిటి రేటు 30.38 శాతంగా ఉండగా, ఆ తర్వాతి స్థానంలో గోవా (24.24), మహారాష్ట్ర (24.17), రాజస్థాన్ (23.33), మధ్యప్రదేశ్ (18.99) రాష్ట్రాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా దేశంలో ఇదివరకెప్పుడు లేని విధంగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరుసగా నాల్గో రోజు సైతం రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,61,500 కరోనా కేసులు, 1,501 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 12,26,22,590 కరోనా టీకాలు ఇచ్చారు. అలాగే, 26.65 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ స్థాయి వ్యాప్తి ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుండటం చాలా ఆందోళన కలిగించే విషయమని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందనీ, కరోనా నుంచి రక్షణ కోసం ఒక ఎన్95 మాస్క్‌ను సరిగ్గా ధరిస్తే సరిపోతుందని తెలిపారు.