Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే నగరం వారణాసి. ఎక్కడ బతికినా, కాశీలో తనువు చాలిస్తే చాలు ! అనుకుంటారు. కానీ వారణాసి లో బతుకున్నవారు మాత్రం కోవిడ్ కోరలకు బలి అవుతున్నారు. భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అత్యంత తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో కూడా కోవిడ్ మరణాలు సంభవిస్తున్న నగరాల్లో వారణాసి ఒకటి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు సంభవించిన కోవిడ్ మరణాల్లో 50శాతం పైగా గణాంకాలను ప్రభుత్వం దాచిపెడుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ రికార్డు లకు, ప్రభుత్వ రికార్డులకు మధ్య 50శాతం తేడా ఉన్నట్టు 'ద వైర్' పరిశోధనలో తేలింది. వారణాసి నగరంలో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక బారులు తీరుతున్నారు. ప్రాణాలు కాపాడే అత్యవసర మందుల కొరత ఒక పక్క కనిపిస్తుంటే, మరో పక్క అవే అత్యవసర మందులు బ్లాక్ మార్కెట్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఇంకోపక్క శ్మశానవాటికల్లో దహనం కోసం తెచ్చిన శవాలు కూడా గంటలకొద్ది క్యూ కడుతున్న దారుణం హృదయాలను కలిచివేస్తున్నది. ఈ దారుణ స్థితికి కారణం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పంచాయితీ ఎన్నికలే.
వారణాసి : వారణాసిలో రెండు ప్రధాన శ్మశాన వాటికలు ఉన్నాయి. హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్. ఈ రెండింటిలో దహనం చేస్తున్నట్టు చెబుతున్న మున్సిపల్ లెక్కలకు, ప్రభుత్వ లెక్కలకు భారీ వ్యత్యాసం కనబడుతున్నది. ఏప్రిల్ 10న ఏడింటికి రెండుగా, ఏప్రిల్ 11న ఏడింటికి ఒకటి, ఏప్రిల్ 12న పదింటికి ఒకటి మాత్రమే కోవిడ్ మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నది. మణికర్ణిక ఘాట్‌లో గతవారం రోజులుగా ప్రతిరోజూ 150 కోవిడ్-19తో చనిపోయిన మృతదేహాలు వస్తున్నట్టు మున్సిపాలిటీ లెక్కలు తెలుపుతున్నాయి. ప్రతిరోజూ వస్తున్న మృతదేహాలు 8 నుంచి 9 గంటలపాటు దహనం కోసం క్యూలో నిలబడాల్సి రావటం అత్యంత దారుణమని ఘాట్‌లోని యశ్‌రాజ్ ద్వివేది అన్నారు. ఈ మృతదేహాలు అన్నీ విద్యుత్ యంత్రంతో దహనం చేసేవి మాత్రమే. మరో 20-25 మృతదేహాలు కట్టెల ద్వారా దహనం చేస్తున్నామని హరిశ్చంద్ర ఘాట్‌లో రాహుల్ యాదవ్ అనే కట్టెల వ్యాపారి తెలిపారు. వారణాసిలో 30శాతం మంది ముస్లిం జనాభా ఉన్నది. అల్తాఫ్ షా మరియు భోలేషా బాబాల తో పాటు మరో 100 వరకు చిన్న ముస్లిం శ్మశాన వాటికలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి రోజు 10కిపైగా కోవిడ్‌తో మరణించిన మృతదేహాలు ఖననానికి వస్తున్నట్టు అన్సారీ అనే మతపెద్ద తెలిపారు. వారణాసిలో సుందర్‌లాల్ ఆస్పత్రి మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రులు ముఖ్యమైనవి. బీహెచ్‌యూలో పరిశోధన చేస్తున్న అభరు జైస్వాల్ అనే 32 సంవత్సరాల యువకుడు, సుందర్‌లాల్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఎదురుచూస్తూ స్ట్రెచర్ మీదే ప్రాణాలు వదిలాడు. ఐసీయూలో తమ స్నేహితుడ్ని చేర్చేందుకు ఎంతోమంది అధికారుల తలుపులు తట్టినా నిష్ఫ్రయోజనమే మిగిలిం ది. జైస్వాల్ మృతదేహానికి మాత్రమే బెడ్ లభించింది. మిశ్రా అనే జర్నలిస్టు చిన్నమ్మ కోవిడ్‌తో పోరాడి ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో మరణిస్తే అంత్యక్రియల కోసం 22వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మరుసటి రోజు మిశ్రా, అమ్మమ్మ కోవిడ్‌కి బలయ్యారు. అంత్యక్రియల కోసం ఈసారి 30వేలు ఖర్చయ్యింది. కోవిడ్బారినపడ్డవారు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ రిపోర్టు వచ్చినవారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్‌లో ఒక ఐడీ కేటాయిస్తున్నారు. ఒకవేళ ఐడీ కేటాయింపు దక్కని పేషంట్లు ఎంత సీరియస్ కండీషన్లో ఉన్నాసరే, ఆస్పతుల్లో చేర్చుకోవటానికి నిరాకరిస్తున్నారు. కోవిడ్ సంఖ్య పెరిగినట్టు వారణాసి మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రాఠీ ప్రకటించారు. సమీపజిల్లాలైన జౌన్పూర్, భౌధీహీ, చందౌలీ జిల్లాల నుండి మృతదేహాలు వారణాసికి వస్తున్నందున సంఖ్య ఎక్కువగా కనబడుతోందని ఆయన వివరించారు. కాగా వారణాసిలో 409 ఆరెంజ్ మరియు రెడ్ జోన్లు ఉండగా, కేవలం 40మాత్రమే గ్రీన్ జోన్లు ఉన్నాయంటే కరోనా విలయతాండవం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదన్న సంగతి వేరుగా చెప్పనవసరం లేదు. యోగితోపాటు ముఖ్యులు అందరూ కరోనాబారిన పడటమే వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దం. మరి వారణాసి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజికవర్గం. మా గంగాకీ బేటా(గంగామాత పుత్రుడు)గా తనను తాను అభివర్ణించుకున్న మోడీ, వారణాసిలో కరోనాబారిన పడి ప్రాణాలు వదులుతున్న సాదాసీదా బిడ్డల గురించి ఏమంటారు.