Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 70 కోట్ల వ్యాక్సిన్ల తయారీ
- సామర్థ్యాన్ని పెంచుతున్నాం : భారత్ బయోటెక్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వాక్సిన్‌కు డిమాండ్ పెరగడంతో భారత్ బయోటెక్ తన సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సంవత్సరానికి ఏకంగా 70 కోట్ల డోసుల కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. భారత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు కోటి డోసుల కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌లలోని ప్లాంట్లలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తాజాగా తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన బిఎస్ఎల్-3 వసతుల కారణంగా తాము తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెరగనుందని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకూ ఈ పద్ధతిని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేయలేదని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే కొవాగ్జిన్ తయారీ కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్)తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. టెక్నాలజీ బదిలీ కూడా సాఫీగా జరుగుతోందని సంస్థ వెల్లడించింది. ఐఐఎల్తోపాటు హాఫ్‌కైన్ బయోఫార్మాసూటికల్ కార్పొరేషన్ కూడా కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయనుంది. దీని కారణంగా కొవాగ్జిన్ ఉత్పత్తి మే, జూన్ నాటికి రెట్టింపు అవుతుందని, జులై, ఆగస్ట్ నాటికి 6 నుంచి 7 రెట్లు అవుతుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న నెలల్లో భారత్ బయోటెక్ కాకుండా ఈ రెండు సంస్థలే నెలకు 3.5 కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నాయి. భారత్ బయోటెక్‌కు గత వారం కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం సీరం ఇన్స్టిట్యూట్కు రూ.3,000 కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1,500 కోట్ల రుణాలివ్వడానికి ఆమోదించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను రెండు, మూడు నెలల్లో సరఫరా చేయడం కోసం అడ్వాన్స్‌గా ఈ నిధులను సమకూర్చింది.