Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ప్రసంగంపై ఏఐఏడబ్ల్యూయూ
- ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆగ్రహం
- హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి... రాష్ట్రాలకి నిధులు ఇవ్వాలి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కరోనా విజృంభణతో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ళపై పీఎం మోడీ సమాధానం చెప్పరా అని ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ కేంద్రాన్ని నిలదీశారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో కీలక అంశాలను ఆయన పక్కనబెట్టడంపై వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం దేశ ప్రజానీకాన్ని చాలా నిరాశ కల్గించిందన్నారు. కరోనా వ్యాప్తి, ప్రభుత్వం చేయాల్సిన సహాయంపై పీఎం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆయన బాధ్యాతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గతం కంటే వైద్య రంగానికి రెట్టింపు కేటాయింపులు చేశామని పీఎం మోడీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కానీ దేశంలో నేడు కరోనా రోగులకి ఆక్సిజన్ కూడా దొరకకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మోడీయే సమాధానం చెప్పాలన్నారు. భారత చరిత్రలో రోగులకి ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఎప్పడూ ఉత్పన్నం కాలేదన్నారు. బీజేపీ సారథ్యంలోని మోడీ హయాంలోనే ఇది అయిందన్నారు. ఇటువంటి పరిస్థితి అనుభవం లేకపోతే మనమంతా అర్థం చేసుకోవచ్చని, కానీ కరోనా గత సంవత్సర కాలం నుంచి మనల్ని పట్టి పీడిస్తుందని అయినా ఆక్సిజన్ అందుబాటులోకి ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదన్నారు. కరోనా సందర్భంగా పేదలు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు తిరిగి ఇంటి ముఖం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది చనిపోయారని వాప్య్షోరు. వారి సంరక్షణ కోసం ఒక్క మాట కూడా పీఎం మాట్లాడలేదన్నారు. అసలు వలస కార్మికులను మనుషులుగా కూడా ఆయన గుర్తించడం లేదని అని ప్రశ్నించారు. ఈ స్థితిలో వారికి ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఆయనపై లేదా అని నిలదీశారు. పేదలకి నెలకి రూ.7,500 తక్షణమే ఇవ్వాలని, రేషన్ సరకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు, ఉపాధి హామీ 200 రోజులకి పెంచి... రోజుకి రూ.400 ఇవ్వాలని సూచించారు. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా మంది కరోనా కారణంగా చనిపోయిన వారున్న దేశంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీపై కూడా 50 శాతం రాష్ట్రాలు కొనుక్కోవాలని... మిగతాది మార్కెట్ శక్తులకి ఇవ్వడం ఏంటని నిలదీశారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందో మోడీ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు, దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించి రాష్ట్రాలకి కేంద్రం తక్షణమే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.