Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణనీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు... వైద్య శాఖ అప్రమత్తం
- కరోనాతో పాటు పెరుగుతున్న డెంగ్యూ బాధితుల సంఖ్య
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూర్ణో
కరోనా మహమ్మారి విజృంభణతో కట్టడి చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా నగరవ్యాప్తంగా బీతావాహ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వేగంగా సంక్రమిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో జన సంచారం తగ్గింది. దాంతోపాటు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రజలంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ తమ పనులు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ సర్కారు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతుండటం గమనార్హం. ఇదే సమయంలో మరోవైపు డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు అధికమవడం రాష్ట్ర వైద్య శాఖ సవాల్‌గా తయారైంది. దీంతో ఢిల్లీ నగరవాసులకు దోమలు కంటి నిండా నిద్రలేకుండా ఉంటున్న పరిస్థితి నెలకొంది.
గత మూడేండ్లలో ఎన్నడూ లేని స్థాయిలో డెంగ్యూ కేసులు ఢిల్లీలో నమోదు అవుతున్నట్టు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఢిల్లీ వైద్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరినట్టు సమాచారం. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను అధికారులు ఇప్పటికే రికగ్నైజ్ చేశారు. అయితే గత వారంలో మలేరియా రోగులు ఎవరూ ధ్రువీకరణ కాలేదని స్పష్టం చేశారు. చికెన్ గున్యాకు సంబంధించి ఒక రోగి ఉన్నట్టు తెలిపారు. అయితే, ఈ ఏడాది మలేరియా సోకిన రోగుల సంఖ్య నాలుగుకు పెరగగా, చికెన్ గున్యా రోగుల సంఖ్య మూడుకి పెరిగినట్టు వెల్లడైంది. కరోనా మహమ్మారి విజంభిస్తున్న తరుణంలో దోమలతో వ్యాప్తి చెందే వైరల్ జ్వరాల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో కరోనా సంక్రమిస్తే రోగ నిరోధక శక్తి తగ్గి ఇతర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వ్యక్తికి రెండు వ్యాధులు ఉంటే, అది వారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతీ ఒక్కరు తమ ఇల్లు, కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రతను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దోమలను నివారించేందుకు దాదాపు 15 వేలకు పైగా ఇండ్లను పురుగు మందులతో పిచికారీ చేసినట్టు అధికారులు మీడియాకి వివరించారు.