Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 142వ స్థానం
- మోడీ, బిజెపినే ప్రధాన ప్రతిబంధకాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : జర్నలిజానికి, జర్నలిస్టులకు భారత్ ప్రమాదకరమైన దేశమని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ నివేదిక పేర్కొంది. దేశంలో జర్నలిస్టులు పని చేసుకునే పరిస్థితి లేదని, వారిని అడ్డగించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ప్రధాని మోడీని, హిందూత్వ కార్యకర్తలను ఆ నివేదిక విమర్శించింది. 2021లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని మంగళవారం ప్రచురించింది. 180 దేశాల్లో భారత్ 142వ స్థానంలో వుంది. నేపాల్ 106వ స్థానంలో వుండగా, శ్రీలంక 127లో వుంది. సైనిక కుట్ర జరగడానికి ముందు మయన్మార్140వ స్థానంలో వుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు వరుసగా 145, 162 స్థానాల్లో ఉన్నాయి. మరోసారి నార్వే అగ్ర స్థానంలో వుండగా ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, డెన్మార్క్ నిలిచాయి. ఆఫ్రికా దేశమైన ఇరిత్రియా అట్టడుగున 180వ స్థానంలో వుంది.
జర్నలి స్టులకు ప్రమాదకరమైన దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంటూ, జర్నలిజానికి చెరుపు కలిగించే దేశంగా వర్గీకరించడానికి గల కారణాలను ఆ నివేదిక వివరించింది. బిజెపి మద్దతుదారులు, హిందూత్వ సిద్ధాంతం కలిసి జర్నలిస్టులకు ప్రతిబంధకమైన వాతావర ణాన్ని సృష్టించాయని పేర్కొంది. పైగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలను విమర్శిస్తున్నందుకు జర్నలిస్టులపై జాతి వ్యతిరేక లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తున్నారని పేర్కొంది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకున్న ప్రభుత్వ అధినేతగా ప్రధాని మోడీని నివేదిక అభివర్ణించింది.
2020లో నలుగురు జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో మరణించారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని భావించే జర్నలిస్టులకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. పైగా డిజిటల్ మీడియాలో సమాచారాన్ని నియంత్రించేందుకు కొత్తగా నిరంకుశ రీతిలో సమాచార సాంకేతిక నిబంధనలను తీసుకొచ్చారని పేర్కొంది. జర్నలిస్టులు అన్ని రకాల దాడులకు గురవుతున్నారని, పోలీసుల దాష్టీకం, రాజకీయ కార్యకర్తల దాడులు, క్రిమినల్ గ్రూపులు లేదా అవినీతి అధికారులు పాల్పడే చర్యలకు బలై పోతున్నారని పేర్కొంది. 2019లో ఎన్నికలు ముగిసినప్పటి నుండి హిందూ జాతీయవాద ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా మీడియా వుండాలంటూ బిజెపి ఒత్తిడి పెంచిందని నివేదిక పేర్కొంది. గతేడాది పత్రికా స్వేచ్ఛను అణచివేసేందుకు కోవిడ్‌ను ఎలా అవకాశంగా తీసుకున్నారో కూడా నివేదిక ప్రత్యేకంగా వివరించింది.
కాశ్మీర్లో జర్నలిస్టుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని, పోలీసులు, పారా మిలటరీ బలగాల వేధింపులు కొనసాగుతునే వున్నాయని తెలిపింది. బిజెపి, హిందూత్వ మద్దతుదారులు చాలా తీవ్రమైన స్థాయిలో సోషల్ మీడియా ప్రచారాలు సాగిస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులను ఎండగట్టాలని బహిరంగం గానే పిలుపునిస్తున్నారని పేర్కొంది. ఒకవేళ వారు మహిళా జర్నలిస్టులైతే వారిని చంపుతామంటూ బెదిరించడానికి కూడా వెనుకాడడం లేదని పేర్కొంది. తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ఇచ్చే ప్రధాన వ్యాక్సిన్ వంటిది జర్నలిజమని 2021 నివేదిక వ్యాఖ్యానించింది.