Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా రోగులే కాదు..
- ఇతర రోగులకూ వైద్యం అందని వైనం
- మోడీ నియోజకవర్గంలో వెలుగులోకి
వారణాసి : మోడీ ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా వలసకార్మికుల బతుకులు నాడు ఎంతగా దుర్భరమయ్యాయో కండ్లారా చూశాం. ఇప్పుడు ఓ పక్క కరోనా సెకండ్ వేవ్ కాటేస్తుంటే... మరోపక్క వలసకార్మికుల కష్టాలు వర్ణనాతీతమైన రీతిలో వెలుగుచూస్తున్నాయి. అలాగే ఆస్పత్రుల వెలుపల కరోనా రోగుల ఆర్తనాదాల గాథలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శవాల గుట్టలు మీడియాలో చూస్తున్నాం.
కరోనా రోగులే కాదు.. ఇతర ఏ వ్యాధి సోకినా రోగులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతున్నది. తాజాగా మోడీ సొంత నియోజకవర్గంలో తనయుడి శవంతో తల్లడిల్లిన ఓ తల్లి ఆవేదన సామాజిక మాద్యమంలో కన్నీరుపెట్టిస్తున్నది. కొడుకు మృతదేహంతో ఆ తల్లి ఒంటరిగా ఈ రిక్షాలో కుప్పకూలిపోయింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ ఘటన వెలుగుచూడటం చర్చనీయాంశమైంది.
అసలింతకీ ఏమైంది..?
మొదటి లాక్డౌన్ సమయంలో ముంబయిలో చేస్తున్న ప్రయివేట్ ఉద్యోగాన్ని వదిలి, తన తల్లి ఉంటున్న గ్రామానికి వచ్చాడు వినీత్. ఇప్పుడు మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ఇటీవల గ్రామానికి చేరుకున్నాడు. కిడ్నీ సమస్య రావటంతో... అతని ఆరోగ్యం సోమవారం క్షీణించింది. కొడుకును చూసిన తల్లి తల్లడిల్లిపోయింది. గ్రామ ప్రజల సహాయం కోరగా.. వినీత్‌ను తీసుకెళ్లటానికి కారును సమకూర్చారు. ఎలాగోలా తంటాలు పడి బీహెచ్‌యూ దవాఖానాకు తీసుకొచ్చింది. అనారోగ్యంతో ఉన్న బిడ్డను తీసుకొచ్చిన ఆ తల్లికి.. అక్కడ ఎవరూ తెలియదు. ఆస్పత్రిలో చేర్చుకోమని కనిపించిన వారినల్లా ప్రాథేయపడింది. ఆ తల్లి గోసను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఓ రిక్షాకార్మికుడు చొరవతీసుకున్నాడు. తల్లిని సముదాయించి బిడ్డతో పాటు మరో ఆస్పత్రికి తరలించారు. కానీ ఆలోపే బిడ్డ కుప్పకూలిపోయాడు.
శ్వాసఆగిపోయింది. అంతే ఆ షాక్ నుంచి తల్లికోలుకోలేక పోయింది. తన బ్యాగులో ఉన్న ఫోన్ తీసి ఎవరినైనా సాయం అడుగదామని ప్రయత్నించినా.. ఎవరూ ఫోన్ ఎత్తలేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యేలా విలపించింది. ఆమె ఆర్తనాదాలు అరణ్యరోదనలా మారాయి. కనీసం బీహెచ్‌యూ వైద్యశాల సిబ్బంది మానవత్వంతో ఆస్పత్రిలో చేర్పించుకుని ఉంటే.. వినీత్ ప్రాణాలు దక్కేవని రిక్షాకార్మికులు తెలిపారు. మోడీ సొంత నియోజకవర్గంలో కరోనాతో మృతిచెందిన శవాల గుట్టల కథనాలు ఇప్పటికే అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. కరోనా రోగులకే కాదు.. ఇతర వ్యాధుల బారినపడినవారికీ వైద్యం కనుచూపు మేరలో కానరావటంలేదు.