Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య, జీవిత బీమా లేక ఆందోళన
- మార్చి 24తో ముగిసిన ప్రత్యేక బీమా పథకం
- రెండో ఏడాది పథకం కొనసాగిస్తామని ప్రకటన చేయని మోడీ సర్కార్
- ప్రమాదంలో.. వైద్యులు, నర్సులు, శానిటేషన్, ఆశా వర్కర్లు, వార్డ్ బార్సు జీవితాలు
- కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైతే చూసే దిక్కులేదు : హెల్త్ వర్కర్స్ యూనియన్లు
న్యూఢిల్లీ : కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కోవటంలో హెల్త్ వర్కర్లు కృషి అంతాఇంతా కాదు. వైరస్‌ను అరికట్డడంలో, బాధితుల్ని కాపాడటంలో ముందుండి పోరాడారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో వైద్యులు, నర్సులు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, వార్డ్ బారుల సేవలు ఎంత కీలకమైనవి అన్నది అందరికీ తెలిసొచ్చింది. చుట్టూ వైరస్ తమను వెంటాడుతోందని తెలిసి...ఎంతో ధైర్యంగా సిబ్బంది విధులు నిర్వర్తించారు. అయితే దేశంలో వైరస్ సెకండ్ వేవ్ విజృంభించినవేళ..హెల్త్ వర్కర్స్ జీవితాలు మరింత
ప్రమాదంలో పడ్డాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కేంద్రం గత ఏడాది మార్చి 26న ప్రత్యేక బీమా పథకాన్ని ప్రకటించింది. కోవిడ్-19బారిన పడి హెల్త్ వర్కర్ ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబానికి రూ.50లక్షలు నష్టపరిహారంగా అందజేయటమే ఈ పథకంలో ప్రధాన ప్రయోజనం. ఈ ఏడాది మార్చి 26తో ప్రత్యేక బీమా పథకం ఆగిపోయింది. మరో ఏడాది దీనిని కొనసాగించటంపై మోడీ సర్కార్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు
కోవిడ్-19 విధుల్లో పాల్గొనటం వల్ల దేశవ్యాప్తంగా 162మంది వైద్యులు, 107మంది నర్సులు, 44ఆశా వర్కర్లు మరణించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. అయితే ఇండి యన్ మెడికల్ అసోసియేషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, కోవిడ్ విధుల వల్ల దేశంలో 734మంది వైద్యులు చనిపోయారు. 350మంది నర్సులు చనిపోయారని మహారాష్ట్రకు చెందిన 'యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్' ప్రకటించింది. అయితే వీరందరికీ ప్రత్యేక బీమా పథకం వర్తించిందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విధుల్లో పాల్గొనటం వల్ల 150మంది ఆశా, అంగన్వాడీ వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని, ఇందులో కేవలం 10మంది బాధిత కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందిందని ఆశా, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు సింధు తెలిపారు. బీమా పథకాన్ని ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుందని, బాధిత కుటుంబాలెన్నో నష్టపరిహారం కోసం పోరాడుతున్నాయని ఆమె అన్నారు. ఈ ఏడాది ఉన్న పథకాన్ని కూడా తీసేసేట్టు ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సెకండ్ వేవ్ తరుముతోంది..
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఈ బీమా పథకాన్ని అమలుజేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఒక లేఖ ద్వారా తెలుస్తోంది. ఈ బీమా పథకాన్ని రెండో ఏడాది కూడా కొనసాగిస్తున్నారా? లేదా? అన్నది చెప్పడానికి కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆసక్తిచూపలేదు. దాంతో మోడీ సర్కార్ తీరుపై హెల్త్‌కేర్ వర్కర్ల యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిరోజూ దాదాపు 3 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నవేళ, బీమా పథకం అమలును ఎలా ఆపేస్తారని యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.
అనారోగ్యపాలైతే ఎలా ?
వైద్యులు, నర్సులు, వార్డ్ బారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, పారిశుద్ధ కార్మికులు..వీరంతా దేశవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్ వైరస్‌ను ఎదుర్కోవటంలో ముందుండి పోరాడారు. అయితే వీరి కోసం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక బీమా పథకం..పెద్దగా వారికి ఉపయోగపడింది ఏమీలేదు. ప్రాణాలు కోల్పోతే...బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందుతుంది కానీ, అనారోగ్యంపాలైతే ఆదుకోదు. వైద్య ఖర్చులకుగానీ, మందులకుగానీ ఈ పథకం ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ప్రాణాలు కోల్పోయిన కేసుల్లోనూ క్లెయిమ్స్‌ను తిరస్కరించిన సందర్భాలెన్నో ఉన్నాయని సమాచారం.
వైరస్ మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ చాలా ప్రమాదకరంగా కనపడుతోంది. ఎది..ఎలా ఉన్నా వైద్య సిబ్బంది, హెల్త్‌కేర్ వర్కర్లు పనిచేయాల్సిందే. కోవిడ్వైరస్ బారినపడి ఒకవేళ ఏమైనా జరిగితే, మా కుటుంబాల పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? బీమా పథకం ఉందని గత ఏడాది కాస్త ధైర్యంగా ఉన్నాం. అదిప్పుడు లేదు. మా ఆందోళనలపై కేంద్రానికి లేఖ కూడా రాశాం. ఎలాంటి స్పందనా రాలేదు.
- జోల్డిన్ ఫ్రాన్సిస్, 'యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్' ఢిల్లీ నాయకుడు
కోవిడ్ కారణంగా హెల్త్ సిబ్బంది అనారోగ్యంపాలైతే రిస్క్ అలవెన్స్ లేదు. బీమా పథకంలో దీనిని పొందుపర్చాలి. ప్రాణాలు కోల్పోయిన కేసుల్లో, బాధిత కుటుంబాలు నష్టపరిహారం కోసం క్లెయిమ్ చేసుకుంటే అనేకం తిరస్కరించారు.
- ఎ.ఆర్.సింధు, జనరల్ సెక్రటరీ,
ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్
తిరస్కరణలెన్నో
- ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ సిబ్బంది అందరికీ ఈ ప్రత్యేక బీమా పథకం వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది.
- కోవిడ్ పేషెంట్ చికిత్సలో పాల్గొనటం వల్లనే వైరస్ సోకి చనిపోయిందని..నిరూపించలేక పోయిందని అనేక ఘటనల్లో క్లెయిమ్స్‌ను తిరస్కరించారు.
- కోవిడ్ హాస్పిటల్స్‌లో పనిచేయలేదు..కదా? అనే కారణంతో మరణించిన ఇద్దరు నర్సుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదు.
- అంగన్వాడీ వర్కర్లను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా అనేక రాష్ట్రాలు గుర్తించకపోవటమూ ఒక సమస్యగా మారింది.
- ఈ ప్రత్యేక బీమా పథకంలో ఎంతమంది క్లెయిమ్స్ చేసుకున్నారు? అన్న వివరాలు కేంద్రం బయటపెట్టలేదు.
- ప్రాణాలు కోల్పోయిన హెల్త్‌వర్కర్ల వివరాల్ని కూడా దాస్తోంది. బీమా పథకంలో 287 క్లెయిమ్స్‌ను కేంద్రం అంగీకరించినట్టు తెలుస్తోంది.