Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలన్నారు. కరోనా వైరస్ రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశాన్ని లాక్డౌన్ నుంచి మనకు మనమే కాపాడుకోవాలని, రెండో దశలో వైరస్ కఠినమైన సవాల్ విసురుతోందని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయమిదని అన్నారు. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదన్నారు.
ఇది అతిపెద్ద సవాల్
మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని చెప్పారు. కోవిడ్ వారియర్స్‌కు ప్రధాని మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై మరోసారి అతిపెద్ద యుద్ధం చేస్తున్నామంటూ రెండో వేవ్ ఇప్పుడు అతిపెద్ద సవాల్ విసురుతోందని అన్నారు. ఈ పరిస్థితిపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. దేశం నలుమూలలా ఆక్సీజన్ కొరత ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు కొత్త ఆక్సీజన్ ప్లాంట్లను, కోవిడ్ హాస్పిటల్స్ కూడా నిర్మిస్తామన్నారు.
హాస్పిటల్స్‌లో పడకలు పెంచుతాం..
ఆక్సిజన్ డిమాండ్ దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగం కూడా ఆక్సీజన్ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాయి. హాస్పిటల్స్‌లో పడకలు పెంచేందుకు కృషిచేస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉంటే లాక్డౌన్ అవసరం లేదు. ఉచిత వాక్సినేషన్ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కొనసాగుతుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకగా భారత్ వ్యాక్సిన్ అందిస్తోంది.