Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : కరోనా రోగులను ఆక్సిజన్ కోసం ఎదురు చూడాలని అడగగలుగుతారా? అని ఢిల్లీహైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చింది. దేశంలో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. కరోనా సంక్షోభంపై కేంద్రంతీరు పట్ల హైకోర్టు జస్టిస్ విపిన్సంఘి, రేఖ పల్లిల ధర్మాసనం మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మందులు, వనరుల ను అవసరమైన వారికి, సరైన సమయంలో అందించకపోతే ప్రజల చేతుల్లో రక్తం ఉంటుంది'' అని పేర్కొంది. వనరులు, ఔషధాల కేటాయింపు ఏమాత్రం సరిగా లేదని, దీని పట్ల తమకు విచారకరంగా ఉందని తెలిపింది. కొన్ని పారిశ్రామిక అవసరాల కోసం ఆక్సిజన్ వాడకాన్ని ఏప్రిల్ 22 నుంచి నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించింది. ''ఈ రోజు కూడా ఎందుకు నిషేధించకూడదు? ఏప్రిల్ 22 కోసం ఎందుకు వేచి ఉండాలి? జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి.
మీరు ఆక్సిజన్ కోసం ఏప్రిల్ 22 వరకూ వేచి ఉండాలని రోగులకు చెప్పబోతున్నారా?'' ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రోగులకు ఇస్తున్న ఆక్సిజన్‌ను తగ్గించాలని గంగారామ్ ఆస్పత్రి వైద్యులు బలవంతం చేస్తున్నట్టు విన్నామని న్యాయమూర్తులు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స చేయడానికి తగినంతగా ఆక్సిజన్ ఉండేలా చూడాలని, పరిశ్రమలకు ఆక్సిజన్ తగ్గించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పెట్రోలియం, ఉక్కు వంటి ఆర్థిక ప్రయోజనాలు మానవ జీవితాలను అధిగమించలేవని, అలాగైతే మనం విపత్తు వైపు వెళ్తున్నట్టేనని తెలిపింది. మందులు, వనరులను ఎక్కడ పంపించాలో నిర్ణయించేటప్పుడు ప్రతి రాష్ట్రం అవసరం ఆధారంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది.