Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఒక్కరోజే 2.59 లక్షల కేసులు
- మహారాష్ట్రలో సంపూర్ణ లాక్డౌన్?
- రాహుల్ గాంధీకి పాజిటివ్
- తెలంగాణలో ప్రతి వంద మందిలో ఐదుగురికి పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా కరోనా మరణాలు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గంటకు దాదాపు 73 మంది ప్రాణాలు కోల్పోతుండటంతో సహా 10 వేల మందికి పైగా కరోనా బారినపడటం వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం. గత 24 గంటల్లో దేశంలో 2,59,170 కరోనా కేసులు, 1,761 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాలు 1,80,530 చేరగా, పాజిటివ్ కేసులు 1,53,21,089కి పెరిగాయి. ఇప్పటివరకు 1,31,08,582 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 20,31,977కు పెరిగాయి.
లాక్డౌన్లోకి మరికొన్ని రాష్ట్రాలు
కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, ఢిల్లీలు లాక్డౌన్ ఆంక్షలు విధించగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ సైతం కరోనా కట్టడికోసం వాసవంతపు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రతివారంలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా.. ఈ సమయంలో కేవలం అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే, జార్ఖండ్ సైతం రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే కర్ఫ్యూ విధించిన మహారాష్ట్ర మంగళవారం నుంచి మరిన్ని ఆంక్షలు విధించింది. అయితే, కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో కంప్లీట్ లాక్డౌన్ దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నదని తెలిసింది.
మధ్యప్రదేశ్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం !
మధ్యప్రదేశ్లో కరోనా కట్టడి చర్యలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి మెరుగైన చర్యలు తీసుకోవాలనీ, ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా చూడాలనీ, రెమిడిసివిర్ను సరఫరాకు అంతరాయం రాకుండా చూసుకోవాలని ఆదేశించింది. అలాగే, పరీక్షలను వేగవంతం చేయాలనీ, ఆర్టీపీసీఆర్ పరీక్షల నివేదికలను 36 గంటల్లోపు అందించాలని ఆదేశించింది.
44 లక్షల టీకాలు వృథా !
ఒకవైపు కేసులు పెరగడం మరోవైపు టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. అయితే, పలు రాష్ట్రాల్లో టీకాల భారీగా వృథా అవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 12,71,29,113 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 11 నాటికి దాదాపు 10 కోట్ల డోసులు ప్రజలకు అందించగా.. 44 లక్షలకు పైగా డోసులు చెత్త కుప్పల పాలయ్యాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ వథాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 12.10 శాతం డోసులు వథాగా పోయాయి. ఆ తర్వాత 9.74 శాతంతో హర్యానా, పంజాబ్లో 8.12 శాతం, మణిపూర్లో 7.8 శాతం, తెలంగాణలో 7.55 శాతం మేర వ్యాక్సిన్లు వథా అయ్యాయి. సమాచారం హక్కు చట్టం కింద పై వివరాలు తెలిశాయి.
రాహుల్ గాంధీకి కరోనా
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి కరోనా సోకింది. అలాగే, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం కరోనా బారినపడ్డారు. కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్లకు సైతం కరోనా వచ్చింది. అలాగే, తన భార్యకు కరోనా సోకడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా, కరోనా కారణంగా ఉత్తరప్రదేశ్ మంత్రి హనుమాన్ మిశ్రా మంగళవారం మరణించారు.
తెలంగాణలో ప్రతి వంద మందిలో ఐదుగురికి పాజిటివ్
రాష్ట్రంలో పాజిటివ్ రేటు శరవేగంగా పెరుగుతున్నది. నాలుగు నెలల క్రితం జనవరి 20న 0.97 శాతానికి పరిమితమైన పాజిటివ్ రేటు నాలుగు నెలల్లో పెరిగి 4.85 శాతానికి పెరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 1,22,143 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 5926 మందిలో వైరస్ బయటపడింది.
అంటే ప్రతి వంద మందిలో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించారు. అదే సమయంలో 18 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 6033 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి. జీహెచ్ఎంసీలో 793, మేడ్చల్-మల్కాజిగిరిలో 488, రంగారెడ్డి 455, నిజామాబాద్ జిల్లాలో 444 కేసులొచ్చాయి.