Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : ప్రముఖ బెంగాలీ రచయిత, విమర్శకులు సంఖ ఘోష్ బుధవారం మృతి చెందారు. ఘోష్ ఈ నెల ప్రారంభంలో కరోనా వైరస్ బారీనపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఘోష్ ఆరోగ్యం మంగళవారం రాత్రి దిగజారింది. 89 ఏళ్ల ఘోష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చాంద్‌పూర్‌లో 1932, ఫిబ్రవరి 6న ఘోష్ జన్మించారు. ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో పిజి పూర్తి చేశారు. విశ్వభారతి, ఢిల్లీ, జాదవ్‌పూర్ వంటి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా పనిచేశారు. 1992 పదవీ విరమణ చేశారు.
ప్రముఖ బెంగాలీ కవుల్లో ఒకరిగా ఘోష్ గుర్తింపు పొందారు. ముఖ్యంగా బెంగాలీ కవిత్వంలో రవీంధ్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని ముందుకు తీసుకునివెళ్లారు. 2011లో పద్మ భూషణను, 2016లో జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్నారు. అంతకు ముందు తన కవితా సంకలనం బాబరెర్ ప్రార్థనకు 1977లో సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు.
హింస, మానవ హక్కుల ఉల్లంఘనలపై వ్యతిరేకతను ఘోష్ తన రచనల ద్వారానే వ్యక్తం చేసేవారు. పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ)ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన రాసిన మటి కవిత చాలా ప్రాచుర్యం పొందింది.