Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా పరీక్షలు, అంబులెన్స్, వైద్య సదుపాయాల సమాచారమివ్వాలని ఆదేశం
అహ్మదాబాద్: ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నిత్యం పదివేలకు పైగా కొత్త కేసులు, వందకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో వైద్య సదుపాయాల కొరతతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. దీంతో కరోనా పరీక్షలు, వైద్యం విషయంలో కోవిడ్-19 రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి విక్రమ్‌నాథ్, జస్టిస్ భార్గవ్ డి కారియాలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ సదుపాయాల సామర్థ్యం, అంబులెన్స్, సర్వీసులు, పడకలు, వైద్యం సంబంధిత వివరాల సమాచారం వెంటనే అందించాలని ఆదేశించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన, అలాగే రోగి పరిస్థితిని అంచనా వేసి వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని పిలుపునిచ్చింది. కాగా, గుజరాత్లో తాజాగా 12,206 కరోనా కేసులు, 121 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు 4,28,178 చేరగా, మరణాలు 5,615కు పెరిగాయి.