Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అసోంలో ఆయల్ అండ్ నాచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగుల్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. శివసాగర్ జిల్లాలోని లాక్వా ఓఎన్జీసీ క్షేత్రం నుంచి సంస్థ వాహనంలో ఉద్యోగులు వెళ్తుండగా ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుందని ఓఎన్జీసీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. '' ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ప్రొడక్షన్ విభాగానికి చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఒకరు జూనియర్ టెక్నీషియన్..అపహరణకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది'' అని కంపెనీ మీడియాకు తెలిపింది. ఎవర్ని కిడ్నాప్ చేశారన్నది తమకు పూర్తి సమచారం లేదని, కిడ్నాపర్లు బాధిత కుటుంబానికిగానీ, మరొకరికిగానీ తమ డిమాండ్లు తెలుపలేదని కంపెనీ అధికారులు అన్నారు. ఉద్యోగులు ప్రయాణించిన వాహనం అసోం-నాగాలాండ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో వదిలేశారని, స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశామని కంపెనీ తెలిపింది. లాక్వా ఓఎన్జీసీ క్షేత్రంలో చమురు, సహజవాయువు బయల్పడటంతో, అక్కడ 1960 నుంచి ఓఎన్జీసీ చమురు, సహజవాయువును వెలికితీస్తోంది.