Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలు రద్దు అయ్యేంతవరకు ఉద్యమం :
రైతు సంఘాల నాయకులు
- ధర్నా స్థలాల్ని ఖాళీ చేయించేందుకు 'మిషన్ క్లీన్ అప్'ను చేపట్టిన హర్యానా
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో నిరసనకు దిగిన రైతుల్ని హర్యానా ప్రభుత్వం బలవంతంగా ధర్నాస్థలాల నుంచి తరలించేందుకు యత్నిస్తోంది. హర్యానా-ఢిల్లీ సరిహద్దులోని 'మిషన్ క్లీనప్' ఆపరేషన్ చేపట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని సన్నద్ధం చేసినట్టు సమాచారం. ఈనేపథ్యంలో హర్యానా ప్రభుత్వ చర్యలకు తాము భయపడి పారిపోమని, శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. సాగు చట్టాలు రద్దు అయ్యేంత వరకు ఉద్యమం సాగుతుందని, స్థానిక ఖాప్ పంచాయతీ నాయకులు, రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.
ఢిల్లీ-జింద్-పటియాలా జాతీయ రహదారిపై ఖాట్కార్ టోల్ ప్లాజా వద్ద హర్యానా రైతు సంఘాల నాయకులు మహా పంచాయత్‌కు పిలుపునిచ్చారు. అత్యంత వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలు రద్దు అయ్యేంత వరకు తమ ఉద్యమం సాగుతుందని రైతు నాయకులు ప్రకటించారు. అయితే అక్కడ నిరసనకు దిగిన రైతుల్ని హర్యానా పోలీసులు బలవంతంగా మరో చోటకు తరలించనున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై రైతు సంఘం బీకేయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జింద్ జిల్లా బీకేయూ నేత ఆజాద్ పాల్వా మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతోందనే కారణం చూపి..బీజేపీ నాయకులు రైతు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు ఉద్యమంలో పాల్గొనడానికి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు ముందుకు రావాలని జింద్ జిల్లావాసుల్ని బీకేయూ నేత ఆజాద్ పాల్వా కోరారు.