Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయన్ ప్రభుత్వం ముందుజాగ్రత్త ఫలితం
త్రిస్సూర్ : కరోనా కేసులు పెరుగుతున్న వేళ చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వుంటే కేరళలో పరిస్థితి భిన్నంగా వుంది. ప్రస్తుతం ఆక్సిజన్ నిల్వలు తగినంతగా వున్న రాష్ట్రం కేరళ ఒక్కటే. అక్కడ కేసులు పెరుగుతున్నా ఆక్సిజన్ సరఫరా ప్రస్తుతానికి సంతృప్తికరంగా వుందని పెసో (పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ) అధికారులు తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ నిల్వలు ప్రస్తుతం తగినంతగా ఉన్నాయని, కొంత మొత్తాన్ని పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, గోవాలకు కూడా సరఫరా చేస్తున్నామని పెసో డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆర్.వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాకు ఆయన నోడల్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతమున్న డేటా ప్రకారం, ఏప్రిల్ 30నాటికి రాష్ట్రానికి రోజుకు వంద టన్నుల వరకు ఆక్సిజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం రోజుకు 246.1 టన్నుల మెడికల్ సరఫరా సామర్ధ్యం ఉందని చెప్పారు. పెద్దఎత్తున ఉత్పత్తి చేసే యూనిట్ల నుంచి ఆస్పత్రులకు ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. సిలిండర్ల ద్వారా కూడా సరఫరా అవుతోంది. ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ సామర్ధ్యం రోజుకు 155.5 టన్నులుగా ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఆక్సిజన్ ఫిల్లింగ్ సామర్ధ్యం 90.5 టన్నులుగా వుందని వేణుగోపాల్ చెప్పారు. పెద్ద మొత్తంలో ద్రవరూప ఆక్సిజన్ నిల్వ చేసుకునేందుకు లైసెన్స్ కలిగిన ఆస్పత్రులు కేరళలో పది ఉన్నాయి. వాటన్నింటి దగ్గర 105 టన్నులు నిల్వ సామర్ధ్యం వుందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 15వరకు వున్న డేటా చూసినట్టయితే మొత్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరాలు రోజుకు 83 టన్నులుగా ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిలో 35టన్నులు కోవిడ్ రోగులకు కాగా, 48 టన్నులు కోవిడ్‌యేతర రోగులకు అవసరమవుతోంది. అవసరానికంటే అధికంగా సరఫరా చేయగలిగే సామర్ధ్యం రాష్ట్రంలో వుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆక్సిజన్ నిల్వలు తగినంతగా వున్న రాష్ట్రం కేరళ ఒక్కటే. ప్రతి ఒక్క రోగికి అవసరమయ్యే ఆక్సిజన్‌ను కచ్చితంగా లెక్క వేసుకుని అందుకు తగినట్టుగా సరఫరా వుండేలా జాగ్రత్తపడడం ఒక కారణమని అన్నారు. ఈ తరహా పద్ధతి ఇతర రాష్ట్రాల్లో అంత చురుగ్గా సాగడం లేదు.
రెండో దశను అడ్డుకునేందుకు సిద్ధం : ముఖ్యమంత్రి పినరయి విజయన్
కరోనా రెండో దశ విజృంభణను అడ్డుకునేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు. ఈ పోరులో అందరికీ టీకా, ప్రత్యేక ఆసుపత్రులు, అవసరమైనన్ని ఐసీయూలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ అవసరమని పేర్కొన్నారు. ఆక్సిజన్సరఫరా రోజువారీ సామర్ధ్యం 99.39 మిలియన్ టన్నుల నుంచి 219 మిలియన్ టన్నులకు పెరిగినట్టు తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీపై కొత్త విధానాన్ని పున:పరిశీలించాలి
వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం ప్రకటించిన కొత్త విధానాన్ని పున:పరిశీలించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. వ్యాక్సిన్ల లభ్యతకు హామీ కల్పించేలా, అదనపు ఆర్థిక భారం మోపకుండా వుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా ఆరోగ్య రంగానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా పేర్కొన్న విధులను నిర్వర్తించడానికి రాష్ట్రాలకు వీలు కల్పించాలని సూచించారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాసి, విడిగా ఒక ట్వీట్ కూడా చేశారు.