Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 98 లక్షల ఉద్యోగాలు లాస్..
- విపత్తు మరింతగా..
- కేంద్రం కార్యక్రమాలన్నీ విఫలం : సీఎంఐఈ నివేదిక
న్యూఢిల్లీ : మోడీ పాలనలో భారత్ నిరుద్యోగం సంక్షోభం అంచులో ఉన్నది. ఈ ఏడాది నిరుద్యోగం గతంలో ఎన్నడూ చూడనంత దారుణంగా ఉన్నది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) నివేదిక వివరించింది. 2020-21లో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు (శాలరీడ్) 98 లక్షలు క్షీణించాయి. 2019-20లో భారత్‌లో 8.59 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. 2021, మార్చి చివరి నాటికి ఈ సంఖ్య 7.62 కోట్లకు తగ్గిపోయింది. దేశంలో సురక్షితమైన ఉద్యోగాల కల్పన, నిలుపుదల కోసం కేంద్రం చేపట్టిన అన్ని కార్యక్రమాలూ విఫలమయ్యాయని నివేదిక సూచించింది. కోవిడ్-19 ప్రస్తుత ఉప్పెన వేలాది మంది కార్మికుల జీవనోపాధికి తీవ్ర ముప్పును సూచిస్తున్నదని పేర్కొన్నది. రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని సీఎంఐఈ అంచనా వేసింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధికంగానే
2019-20 నుంచి వచ్చిన ఉపాధి డేటా ప్రకారం.. దేశంలోని మొత్తం జీతాల ఉద్యోగాలలో పట్టణ భారతదేశం 58 శాతం వాటాను కలిగి ఉన్నది. సీఎంఐఈ నివేదిక ప్రకారం.. 2020-21 మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన ఉద్యోగ నష్టం మొత్తం 98 లక్షలలో 38శాతం జాబ్‌లు (దాదాపు 38 లక్షలు) పట్టణ ప్రాంతాల్లో పోయాయి. అంటే పట్టణ భారతదేశం ఏడాది కాలంలో మరిన్ని ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని నివేదిక వివరించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో శాలరీడ్ జాబ్స్ 42 శాతంగా ఉన్నది. అయితే, 2020-21లో గ్రామీణ భారత్ మొత్తం ఇలాంటి ఉద్యోగాలను కోల్పోయిన శాతం 62గా ఉన్నది. ఇది దాదాపు 60 లక్షల జాబ్ లాస్‌కు సమానం. అయితే, రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య.. పట్టణ ప్రాంతాల్లో కోల్పోయే ఉద్యోగాల కంటే అధికంగా ఉంటుందని సీఎంఐఈ హెచ్చరించింది.