Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంక్ లీక్
- 24 మంది కరోనా రోగులు బలి
- మహారాష్ట్రలోని నాసిక్ ఆస్పత్రిలో ఘోరం
- ఆక్సిజన్ సరఫరాకు తీవ్ర అంతరాయం
- ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఉద్దవ్ థాకరే ఆదేశం
ప్రాణవాయువే ప్రాణం తీసింది...
ఓ పక్క కరోనా విజృంభణతో పాటు.. ఆస్పత్రుల్లో ప్రమాదాలు రోగుల ఊపిరితీస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలని ఆస్పత్రుల్లో చేరితే.. ప్రమాదాల రూపంలో మృత్యువు వెన్నాడుతున్నది. దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో ఓ ఆస్పత్రి వెలుపల ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవ్వడం... రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవటం... వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం క్షణాల్లో జరిగిపోయింది.
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని నాసిక్‌లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఘోరం జరిగిపోయింది. 24 మంది కరోనా రోగుల ప్రాణాలు క్షణంలో గాలిలో కలిసిపోయాయి. ఆస్పత్రి బయట ఉన్న ఆక్సిజన్ మెయిన్ స్టోరేజి ట్యాంక్ లీక్ కావడంతో వెంటిలేటర్‌పై వున్న కరోనా రోగులకు ప్రాణవాయువు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవ డంతో 24 మంది రోగుల ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. ప్రమాదంలో చనిపోయినవారి బంధువులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.
బుధవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెయిన్ ఆక్సిజన్ ట్యాంక్ నుంచి ఆక్సిజన్వాయువు చిమ్ముకుంటూ బయటకు తన్నుకురావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన వాయువు వ్యాపించడంతో తీవ్ర భయాందోళనకర వాతావరణమేర్పడింది. ప్రమాదం జరిగే సమయానికిి ఈ మున్సిపల్ ఆస్పత్రిలో 171 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. నీటిని స్ప్రే చేయడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోవడంతో 24మంది రోగులు చనిపోయారు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న మిగతావారిలో 31మందిని ఇతర ఆస్పత్రులకు తర లించారు. ఆక్సిజన్ ట్యాంక్ లీక్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని నాసిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ మంధరే తెలిపారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ఫుడ్స్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మంత్రి రాజేంద్ర షింగనే తెలిపారు. ఆక్సిజన్ ట్యాంక్‌ను వేరొక ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో అది లీక్ అయిందని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మాట్లాడుతూ ఆక్సిజన్ స్టోరేజి ట్యాంక్ వాల్వులు లూజ్ అవడం వల్లే అది బయటకు చిమ్మిందని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎన్సీపీ నేత మజీబ్ మేమన్ డిమాండ్ చేశారు.